The chicken industry in bad position కోళ్ల పరిశ్రమ విలవిల!
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:17 AM
The chicken industry in bad position కోళ్ల పరిశ్రమకు ఒకప్పుడు జిల్లా పేరొందింది. నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు నెలల కిందట వైరస్ ప్రభావంతో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో నేడు కోడిగుడ్ల ధరలు పెరిగినా ఫారం నిర్వాహకులకు ప్రయోజనం ఉండడం లేదు.
కోళ్ల పరిశ్రమ విలవిల!
వేధిస్తున్న వింత వ్యాధులు
సెప్టెంబరులో లక్షలాది కోళ్ల మృతి
గుడ్డు ధర పెరిగినా దక్కని ఫలితం
ఆందోళనలో నిర్వాహకులు
నెల్లిమర్ల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి):
కోళ్ల పరిశ్రమకు ఒకప్పుడు జిల్లా పేరొందింది. నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు నెలల కిందట వైరస్ ప్రభావంతో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో నేడు కోడిగుడ్ల ధరలు పెరిగినా ఫారం నిర్వాహకులకు ప్రయోజనం ఉండడం లేదు. కోడిగుడ్డు ధర రిటైల్ మార్కెట్‌లో రూ.8 పలుకుతుండగా ఫారం వద్ద రూ.6 ఉంది. రైతుకు, కొనుగోలుదారుకు మధ్యనున్న దళారీ లాభపడుతున్నాడు. కోడిపిల్లలను పెంచి వ్యయప్రయాసలకోర్చుతున్న రైతు నిరాశతో ఉంటున్నాడు.
జిల్లాలో కొత్తవలస ప్రాంతంలో ఫౌల్ర్డీ ఫారాలు అధికం. విశాఖ సరిహద్దు ప్రాంతంలో ఇదో హబ్‌గా నిలుస్తోంది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు సైతం ఇక్కడి కోళ్లు సరఫరా అవుతుంటాయి. . అయితే వేసవిలో రకరకాల తెగుళ్లతో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఆపై సెప్టెంబరులో ఫారాలకు ఫారాలే వింత వ్యాధితో ఖాళీ అయిపోయాయి. ఆ పరిస్థితి నుంచి ఇంకా కోలుకోలేదు. నేడు గుడ్డు ధర పెరిగింది. కానీ జిల్లాలో ఆ స్థాయిలో ఉత్పత్తి లేదు. దీనివల్ల పెరిగిన ధర ఇక్కడి రైతులకు అంతగా కలిసి రాలేదు.
ఒడిశా ప్రభావం..
ఒడిశాలో గుడ్లు పెట్టే ఫౌల్ర్డీ ఫారాలు ఇటీవల పెరిగాయి. వాస్తవానికి మన జిల్లాలో ఉత్పత్తయ్యే గుడ్లు ఎక్కువగా ఒడిశాకు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు అక్కడే ఫారాలు పెరగడంతో ఇక్కడ నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. వాస్తవానికి ట్రేడర్లే గుడ్డు ధర నిర్ణయిస్తారు. గుడ్డుకు ఉండే గిరాకీ, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ధర నిర్ధారిస్తారు. ప్రస్తుతం పేపరు ధర రూ.7 వరకూ ఉంది. ఏజెంట్ కమీషన్ 25 పైసలు రైతుపైనే పడుతోంది. ట్రేడర్లు విధిస్తున్న ధరతో కేవలం రైతుకు రూ.6 లోపు మాత్రమే అందుతోంది. తక్కువ మార్జిన్‌తో ఫారమ్‌ల నిర్వహణ చాలా కష్టమని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా కోళ్ల దాణా ధర భారీగా పెరిగింది. ఫారాల వద్ద గుడ్డు ధర రూ.6 దాటితే కానీ కోలుకోలేమని చెబుతున్నారు.
సంక్షోభంలో పరిశ్రమలు
ఫౌల్ర్డీ పరిశ్రమలు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నాయి. వింత వ్యాధులతో కోళ్లు చనిపోతున్నాయి. ధర స్థిరీకరణ కూడా లేదు. ట్రేడర్లు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం కోడిగుడ్ల ధర కూడా అలాగే ఉంది. బహిరంగ మార్కెట్‌లో ధర బాగుండగా.. రైతుల వద్ద మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి.
- రామారావు, ఫౌల్ర్టీఫారం నిర్వాహకుడు, నెల్లిమర్ల
--------------------