కోళ్ల ఫారం తొలగించాలి
ABN , Publish Date - May 24 , 2025 | 11:43 PM
మండలంలోని బి.రసాడవలస గ్రామానికి ఆనుకుని ఉన్న కోళ్ల ఫారాన్ని తొలగించాలని గదబవలస, చింతలవలస, కైలాం, అమరాయివలస,బి.రసాడవలస గ్రామాల ప్రజలు కోళ్ల ఫారం ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు.
మెంటాడ, మే 24 ( ఆంధ్రజ్యోతి): మండలంలోని బి.రసాడవలస గ్రామానికి ఆనుకుని ఉన్న కోళ్ల ఫారాన్ని తొలగించాలని గదబవలస, చింతలవలస, కైలాం, అమరాయివలస,బి.రసాడవలస గ్రామాల ప్రజలు కోళ్ల ఫారం ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. తొలగించే వరకూ కదిలేది లేదని సిబ్బంది, కూలీలను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.ఈ సందర్భంగా బాధిత గ్రామాల ప్రజలు మాట్లాడుతూ ఐదేళ్ల కిందట ఏర్పాటుచేసిన కోళ్లఫారం వల్ల తామంతా దుర్వాసనతో అవస్థలకు గురవుతున్నామని వాపోతున్నారు. కోళ్లఫారం వ్యర్థాలను గుంతలోకి తరలిస్తున్నారని, దీంతో ఊట వల్ల గుంతను ఆనుకుని వున్న సుమారు 100 ఎకరాల పంటలు దెబ్బతింటుందని తెలిపారు. కోళ్లఫారం ఊట చేరి దగ్గరలోని అనంతసాగరంలోని చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు వాపోయారు. ఏసీ కోళ్ల ఫారం కావడంతో ఎవరికీ ఇబ్బంది ఉండదని అప్పట్లో తమను నమ్మించారని, అధికారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని తెలిపారు. యాజమాన్యం తక్షణమే కోళ్ల ఫారం తొలగించకపోతే ఆ పని తామే చేయాల్సి వుంటుందని తేల్చి చెప్పారు. దీంతో కోళ్ల ఫారం యాజమాన్యం పంపిన ప్రతినిధులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. వచ్చే నెల ఐదో తేదీ వరకూ గడువు ఇవ్వాలని యాజమాన్యంతో చర్చించి తమ సమస్యలు పరిష్కరిస్తామని ఇవ్వడంతో మధ్యాహ్నం ముడు గంటల సమయంలో బాధితులు ఆందోళన విరమించారు.