ప్రాణం తీసిన కుంపటి
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:55 PM
చలిని తట్టుకోలేక ఓ వృద్ధురాలు వెచ్చదనం కోసం మంచం కింద కుంపటిని పెట్టుకుని నిద్రపోయింది.
- చలిని తట్టుకునేందుకు మంచం కింద పెట్టుకుని..
- మంటల్లో చిక్కుకుని వృద్ధురాలు మృతి
- కాలబూడిదైన 12 పూరిళ్లు.. సీతారాంపురంలో ఘటన
తెర్లాం, డిసెంబరు 13 (ఆంఽధ్రజ్యోతి): చలిని తట్టుకోలేక ఓ వృద్ధురాలు వెచ్చదనం కోసం మంచం కింద కుంపటిని పెట్టుకుని నిద్రపోయింది. అయితే, కుంపటి నుంచి మంటలు చెలరేగి మంచానికి అంటుకుని ఇల్లంతా వ్యాపించడంతో నిద్రలోనే ఆమె సజీవ దహనమైంది. ఈ అగ్నికీలలు అదే వరుసలో ఉన్న మరో 12 ఇళ్లకు అంటుకోవడంతో కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన సీతారాంపురం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోస్టు పాపమ్మ (70)అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొడుకులు ముగ్గురూ ఇప్పటికే మృతి చెందారు. కుమార్తెలకు పెళ్లిళ్లు కావడంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. పాపమ్మ తన కోడలు లక్ష్మితో కలిసి పూరింట్లో ఉంటుంది. అయితే, శుక్రవారం రాత్రి చలిని తట్టుకునేందుకు మంచం కింద కుంపటి పెట్టుకుని దుప్పటి కప్పుకుని పడుకుంది. గాఢనిద్రలో ఉండగానే మంచానికి నిప్పంటుకుని మంటలు చెలరేగడంతో అదే వరుసలో ఉన్న 12 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నికీలల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాపమ్మతో ఉంటున్న కోడలు లక్ష్మి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. పాపమ్మను రక్షించేందుకు ఎవ్వరూ సాహసించలేకపోయారు. దీంతో ఆమె సజీవదహనమైంది. ఇళ్లన్నీ బూడిదవడంతో బాధితు లంతా కట్టుబట్టలతో మిగిలారు. కోస్టు గురువులు ఇంట్లో రెండున్నర తులాల బంగారంతో పాటు రూ.80 వేల నగదు కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. సుమారు రూ.6 లక్షలు ఆస్తినష్టం సంభవించిందని రెవెన్యూ, అగ్నిమాపకశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీనాయన.. బాధితులను ఆదుకోవాలని, సహాయకచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ము నాయుడు బాధితులను పరామర్శించారు. తహసీల్దార్ హేమంత్‌కుమార్ సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాల వివరాలతో పాటు నష్టం వివరాలను నమోదు చేసుకున్నారు. ఐదు రోజులకు సరిపడే ఆహార పదార్ధాలు, వంటసామగ్రిని అందజేశారు. బాధితులంతా ప్రస్తుతం గ్రామంలోని పాఠశాలలో తలదాచుకుంటున్నారు.