ఆశలను చిదిమేసిన బస్సు
ABN , Publish Date - Jul 01 , 2025 | 12:33 AM
ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని ఆదుకుంటుందని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు అడియాసలయ్యాయి.
కొత్తవలస, జూన్30 (ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని ఆదుకుంటుందని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు అడియాసలయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఇంజనీరింగ్ చదువు పూర్తిచేయనున్న ఆ విద్యార్థినిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం మండలం కుమిలి గ్రామానికి చెందిన కుప్పిలి అప్పయ్యమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పయ్యమ్మ భర్త చనిపోవడంతో కూరగాయలు అమ్ముకుంటూ పెద్ద కుమార్తె నాగమణిని విజయనగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదివిస్తోంది. నాగమణి ప్రస్తుతం సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతోంది. మరికొద్ది రోజులలో చదువు పూర్తయితే నాగమణికి మంచి ఉద్యోగం వచ్చి కుటుంబాన్ని ఆదుకుంటుందని ఆమె ఎంతో ఆశపడింది. అంతలోనే ఈ తల్లి ఆశలు ఆవిరైపోయాయి. కుమార్తె నాగమణి ఆదివారం సాయంత్రం సింహాచలం వెళ్లే దారిలో ఉన్న ప్రహ్లాదపురం బంధువులు ఇంటికి వెళ్లింది. రాత్రికి అక్కడే ఉన్న నాగమణి సోమవారం ఉదయం అరుకు వెళ్లడానికి బంధువులతో సిద్ధమైంది. సోమవారం 10 గంటల సమయంలో బంధువులు అందరూ మోటార్ సైకిళ్లపై అరకు బయలుదేరారు. నాగమణి కూడా తన మేనమామ దాసరి కార్తీక్ స్కూటీ వెనుక కూర్చుంది. మండలంలోని మంగళపాలెం జంక్షన్ సమీపంలో వారి స్కూటీని కొత్తవలస నుంచి విశాఖ వెళుతున్న సిటీ బస్సు ఢీకొంది. దాంతో స్కూటీ వెనుక కూర్చున్న నాగమణి బస్సు చక్రం కిందపడి అక్కడక్కడే మృతి చెందింది. మేనమామ దాసరి కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేశారు. చేతికి అందివస్తుందనుకున్న కూతురు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లి అప్పయ్యమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. నాగమణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శృంగవరపుకోట ఆసుపత్రికి తరలించారు.