Share News

వంతెన.. తప్పనున్న యాతన

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:54 PM

వర్షా కాలం వచ్చిందంటే వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.

వంతెన.. తప్పనున్న యాతన
తాటివాస గుండా నదిని దాటుతున్న గ్రామస్థులు

- చంపావతి నదిపై మినీ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు

- రూ.6.50 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

- పనుల వేగవంతానికి చర్యలు

- నెరవేరనున్న ఎనిమిది గ్రామాల ప్రజల కల

గజపతినగరం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వర్షా కాలం వచ్చిందంటే వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. మూడు నెలల పాటు ఇళ్లకు పరిమితం కావాల్సిందే. అత్యవసర సమయాల్లో చంపావతి నదిని దాటాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టు కోవాల్సిందే. వరద తగ్గితే తాటి వాసాలు వేసుకొని దాని మీద నుంచి నదిని దాటాల్సిన పరిస్థితి. ఆ ఊర్లు పుట్టిన నాటి నుంచి నేటివరకూ ఇదే దుస్థితి. అయితే, వారి కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఎన్నో ఏళ్లనాటి కల నెరవేరబోతుంది. చంపావతి నదిపై వంతెన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ.6.50కోట్లు మంజూరు చేసింది. దీంతో ఎనిమిది గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

10gpm-20.gifమర్రివలస వద్ద చంపావతిపై వంతెన నిర్మించాల్సిన ప్రదేశం ఇదే

మండలంలోని మర్రివలస, సారవలస, సిగడంవలప, రావివలస, యర్రగుడ్ల, మల్లునాయుడు వలస, పనుకువలస, ఎర్రాడవలస గ్రామాలకు చెందిన ప్రజలు బయటకు ప్రాంతాలకు వెళ్లాలంటే చంపావతి నదిని దాటాలి. అయితే, నదిపై వంతెన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వారి బాధలు వర్ణణాతీతం. వేసవిలో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది కనుక నదిలోకి రాకపోకలు సాగిస్తుంటారు. వర్షా కాలంలో మాత్రం నీటి ఉధృతి కారణంగా ఆయా గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమవుతుంటారు. అత్యవసర సమయాల్లో ఈ గ్రామాలకు 108 వాహనం కూడా రాని పరిస్థితి నెలకొంటుంది. ఉద్యోగులు కూడా ఆయా గ్రామాలకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతుంటారు. నదిని దాటేందుకు మర్రివలస వద్ద తాటివాస (దుంగ)ను ఏర్పాటు చేశారు. దీని మీద గుండా నడిచి నదిని దాటుతుంటారు. ఏ మాత్రం పట్టుతప్పినా నీటిలో కొట్టుకుపోతారు. ఈ సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వంతెనను నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా స్థానికులు కోరుతున్నా పట్టించుకున్న నాథుడే లేదు. గతంలో ఎంతో మంది నాయకులు వచ్చి హామీలు ఇవ్వడమే తప్పా ఆచరణలో మాత్రం శూన్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో ఏఎంసీ చైర్మన్‌ పీవీవీ గోపాలరాజు, టీడీపీ మండల అధ్యక్షుడు గంట్యాడశ్రీదేవి, నాయకులు శీరంరెడ్డి రామ్‌కుమార్‌, ప్రదీప్‌కుమార్‌, ఆయాగ్రామాల పెద్దలు కలిసి ఇటీవల సంబరాలు జరుపుకొన్నారు.

వైసీపీ నిర్లక్ష్యం..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో కొనిస, పట్రువాడ, మర్రివలస వద్ద మినీ వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అప్పటి ఎమ్మెల్యే కేఏ నాయుడు విన్నపం మేరకు అప్పటి మంత్రి నారా లోకేశ్‌ కొనిస గ్రామం వద్ద జరిగిన సభలో పాల్గొని నిధులు మంజూరు చేశారు. కొనిస వంతెనకు రూ.5కోట్లు, పట్రువాడ వంతెనకు రూ.4.30కోట్లు, మర్రివలస వంతెన నిర్మాణా నికి రూ.5.20కోట్లను మంజూరు చేశారు. అయితే, కొనిస వంతెన పనులు వెంటనే పూర్తయ్యాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్రువాడ వంతెనను 2022లో పూర్తి చేసింది. కానీ, మర్రివలస బ్రిడ్జిని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాటు కాలయాపన చేయడంతో నిధులు మురుగుపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మర్రివలస వంతెనకు రూ. 6.50కోట్లు మంజూరయ్యాయి.

ఫిబ్రవరిలో టెండర్లు పిలుస్తాం

రెండు నెలల కిందట దత్తి గ్రామంలో జరిగిన పింఛన్ల పండగ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లాను. ఆయన స్పందించి మర్రివలస మినీ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌కు మా నియోజకవర్గ ప్రజలు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నదిలో వరద తగ్గుముఖం పట్టిన తరువాత, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వంతెన పనులకు టెండర్లు పిలుస్తాం. పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం.

- కొండపల్లి శ్రీనివాస్‌, మంత్రి

ఆనందంగా ఉంది

వంతెన లేక మేము పడిన కష్టాలు అన్నీ ఇన్నీకావు. పిల్లల చదువులకు, ఆసుపత్రికి వెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇన్నాళ్లకు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది.

-శీలం అప్పలనాయుడు, మర్రివలస

మా కష్టాలు పిల్లలకు రాకూడదు

చంపావతి నదిని దాటేందుకు మేము అనేక కష్టాలు పడ్డాం. మా కష్టాలు మా పిల్లలకు రాకూడదు. వంతెన కోసం ఎన్నో ఏళ్లుగా నాయకులు, అధికారులను కోరుతున్నా పట్టించుకోలేదు. ఇన్నాళ్లకు మోక్షం కలిగింది. వంతెన నిర్మాణం పూర్తి చేసి ఎనిమిది గ్రామాల ప్రజల కష్టాలను తీర్చాలి.

- చల్ల సింహాచలం, మర్రివలస

Updated Date - Dec 12 , 2025 | 11:54 PM