Share News

బెల్టు ఆగలే!

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:11 AM

జిల్లాలో ఎక్కడికక్కడే బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి దందా కొనసాగిస్తున్నారు.

 బెల్టు ఆగలే!

- మద్యం అనధికారి విక్రయాలు

- లైసెన్స్‌డ్‌ దుకాణాల నుంచే సరఫరా

- బాటిల్‌పై అదనంగా రూ.30 వసూలు

- తూతూమంత్రంగా ఎక్సైజ్‌ దాడులు

పార్వతీపురం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడికక్కడే బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి దందా కొనసాగిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా బెల్టు షాపులు నిర్వహిస్తూ మందుబాబుల జేబులను గుల్ల చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టు దుకాణాల ద్వారానే మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పోటాపోటీగా ఆ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాలతో పాటు ప్రధాన గ్రామాల్లో ఎక్కడికక్కడే బెల్ట్‌ షాపులు కనిపిస్తున్నాయి. సిండికేట్‌లు ఒక్కో బాటిల్‌పై రూ.ఐదు నుంచి రూ.పది అదనంగా ఇచ్చి మద్యం కొనుగోలు చేసుకుంటున్నారు. గ్రామాల్లో ఒక బాటిల్‌పై అదనంగా రూ.20 నుంచి రూ.30 పెంచి అమ్మకాలు చేపడుతున్నారు. కొన్నిసార్లు డిమాండ్‌ను బట్టి రూ.50 అదనంగా వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపులకు లైసెన్స్‌ ఫీజు కింద ఏడాదికి రూ.55 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు చెల్లించాలి. దుకాణం నిర్వహణ తదితర వాటి కోసం రోజుకు కనీసం రూ.20 నుంచి రూ.25 వేలు ఖర్చువుతుంది. రోజువారి సేల్స్‌ అధిక మొత్తంలో ఉంటేనే వ్యాపారులకు గిట్టుబాటు అవుతుంది. లేకుంటే నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు వ్యాపారులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. ఈ మేరకు బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలోని ఒక మండలంలో ఐదు మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో ఒక దుకాణం నుంచి కేవలం బెల్ట్‌ షాపులకే మద్యం సరఫరా అవుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో బెల్ట్‌షాప్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు జరిగేలా చూస్తున్నారు. కిరాణా షాపులు, బడ్డీల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతుంది. బెల్ట్‌ నిర్వాహకులు లైసెన్స్‌ దుకాణాల్లో మద్యం సీసాలను కొనుగోలు చేసి ద్విచక్ర వాహనాలపై గ్రామీణ ప్రాంతాలకు తీసుకొని వచ్చి విక్రయాలు చేపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో రెండు నుంచి మూడు వరకు మద్యం బెల్ట్‌ దుకాణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెల్ట్‌ దుకాణాలు నిర్వహిస్తే బెల్టు తీస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బెల్ట్‌దుకాణాలను నివారించాల్సిన బాధ్యత ఎక్సైజ్‌శాఖ అధికారులపై ఉంది. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తూతూమంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఏ సమయంలో అయినా దొరుకుతుంది

లైసెన్స్‌ దుకాణాల్లో మద్యం కొనుగోలు చేయాలంటే పట్టణానికి వెళ్లాలి. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బెల్ట్‌ షాపుల్లో ఏ సమయంలోనైనా మాకు మద్యం దొరుకుతుంది. సీసాకు రూ.20 నుంచి రూ.30 అధికంగా తీసుకున్నా 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటుంది.

- మద్యం ప్రియుడు, పార్వతీపురం

చర్యలు తీసుకోవాలి

బెల్ట్‌ దుకాణాల నిర్వాహకులు మందుబాబులను దోచుకుంటున్నారు. డబ్బులు తీసుకుని కొన్నిసార్లు మద్యం కల్తీచేసి నాణ్యమైనదని చెప్పి అంటగడుతున్నారు. దీనివల్ల ఒళ్లు గుల్లవుతుంది. ఇప్పటికైనా ఎక్సైజ్‌శాఖ అధికారులు స్పందించి బెల్టు దుకాణాలను నివారించాలి.

-అప్పలనాయుడు, కొమరాడ

Updated Date - Sep 28 , 2025 | 12:11 AM