Share News

The appointment date is the key నియామక తేదీయే కీలకమట

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:05 AM

The appointment date is the key రెండు రోజుల్లో జరగనున్న గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీ (ఎఎన్‌ఎం గ్రేడ్‌-3) బదిలీలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో చోటు చేసుకున్న ప్రాధాన్యతలను చూసి అందరూ విస్తుపోయారు.

The appointment date is the key నియామక తేదీయే కీలకమట
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ గ్రీవెన్స్‌కు వచ్చిన గ్రామ వార్డు సచివాలయ గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలు

నియామక తేదీయే కీలకమట

ఆ రోజు ఆధారంగా బదిలీ స్థానం నిర్ణయం

ఏఎన్‌ఎంలను వెనక్కు నెట్టిన ఒక్కరోజు తేడా

మెరుగైన ర్యాంకర్లు డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి పరుగులు

శృంగవరపుకోట, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి):

రెండు రోజుల్లో జరగనున్న గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీ (ఎఎన్‌ఎం గ్రేడ్‌-3) బదిలీలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో చోటు చేసుకున్న ప్రాధాన్యతలను చూసి అందరూ విస్తుపోయారు. డేట్‌ ఆఫ్‌ అపాయింట్‌ మెంట్‌ను అనుసరించి బదిలీ స్థానాలను నిర్ణయించడంతో నియామక పరీక్షలో మెరుగైన ర్యాంకులను సాధించిన వారంతా వెనక్కి వెళ్లిపోయారు. పరీక్షలో తక్కువ ర్యాంకులు పొందిన ఏఎన్‌ఎంలంతా బదిలీల్లో ముందువరసకు వచ్చారు. ఈ నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు పరీక్షలో మంచి ర్యాంకులు పొందిన వారంతా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ వార్డుల్లో ప్రజా ఆరోగ్య పరిరక్షణకు గ్రామాల్లో గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలు, వార్డుల్లో హెల్త్‌ సెక్రటరీలను నియమించారు. నియామక పరీక్షలో ర్యాంకులు సాధించిన వారందరినీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించేందుకు 2019 నవంబర్‌ 5న జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మొదటి ర్యాంకుతో మొదలెట్టి ఆఖరు ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ అయ్యేసరికి అర్ధరాత్రి సమయం పట్టింది. దాదాపుగా రెండు వందలలోపు ర్యాంకులు వచ్చిన వారందరికీ మధ్యాహ్న సమయానికి కౌన్సెలింగ్‌ పూర్తికావడంతో అదేరోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో చేరేందుకు వెళ్లారు. కొంతమందిని కౌన్సెలింగ్‌ రోజునే చేర్చేసుకున్నారు. మిగతా వారు మరుసటి రోజు ఉద్యోగంలో చేరారు. దీనివల్ల కొంత మందికి కౌన్సెలింగ్‌ జరిగిన నవంబర్‌ 5, మరికొంత మందికి నవంబర్‌ 6న చేరినట్లు సర్వీస్‌ రికార్డుల్లో నమోదైంది. సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నవారిలో చాలా మంది నవంబర్‌ 5న గ్రామ, వార్డు సచివాలయాల్లో చేరినట్లు సర్వీస్‌ రికార్డుల్లో నమోదు చేసేసుకున్నారు. వీరంతా బదిలీల్లో ముందు వరసకు వెళ్లారు. సర్వీస్‌ రికార్డులో నవంబర్‌ 6న నమోదైన వారంతా వెనక ఉండిపోయారు. ఇది మోసం అంటూ వాపోతున్నారు. నియామక సమయంలో అందరం ఒకే రోజున గంటల వ్యవధి తేడాతో నియామక పత్రాలు పొందామని, గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులు చేర్చుకొనే సమయంలో మార్పుతో ఒక రోజు తేడా వస్తున్నందున అధికారులు చేసిన తప్పునకు తమను బలి చేయోద్దని కోరుతున్నారు. అనువైన స్థానాలకు అర్హత వున్న తమను కాదని సర్వీస్‌ రికార్డులో నమోదైన డేట్‌ను ప్రాధాన్యత అంశంగా తీసుకోవడం మెరుగైన ర్యాంకులు సాధించిన వారిని అవమానించడమేనంటూ పేర్కొంటున్నారు. ఈ విషయంలో యూనియన్‌ నాయకులు పెదవి విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

- ఎక్కువ వయసులో దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం ఏ ఉద్యోగికైనా కష్టమే. అందుకే బదిలీల సమయంలో డేట్‌ఆఫ్‌బర్త్‌(వయస్సు)కు ప్రాధాన్యం ఇస్తారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమికంగా తయారు చేసిన జాబితాలోనూ ఎక్కువ వయసు వున్నవారికి అన్యాయం జరుగుతోంది. డేట్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకోవడంతో ఆ తేదీన చేరిన చిన్న వయసు కలిగిన ఏఎన్‌ఎంలు, ఎక్కువ వయసు కలిగిన ఏఎన్‌ఎంల కంటే ముందుకు వచ్చారు.

- నియామక కౌన్సెలింగ్‌ తేదీ అందరికీ ఒకటే కాబట్టి డేట్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంటును ప్రాధాన్యత క్రమం నుంచి తొలగించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి జీవనరాణిను ఏఎన్‌ఎంలు కోరినట్లు తెలిసింది. దీనికి డీఎంహెచ్‌ఓ కూడా స్పందించి డేట్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంటును బదిలీ ప్రాధాన్యత నుంచి తొలగించాలని సూచించినట్లు సమాచారం. తుది జాబితాలో వీరందరికీ న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.

Updated Date - Jun 29 , 2025 | 12:05 AM