Share News

The airport is the focal point of North Andhra Pradesh. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకే కేంద్ర బిందువు

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:07 AM

The airport is the focal point of North Andhra Pradesh. భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే కేంద్రబిందువు కానుందని పౌరవిమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. విమానాశ్రయ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు.

The airport is the focal point of North Andhra Pradesh. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకే కేంద్ర బిందువు
ఎయిర్‌పోర్టు నిర్మాణం గురించి మ్యాప్‌ద్వారా తెలుసుకొంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకే కేంద్ర బిందువు

ఈఏడాది చివరిలో ట్రైల్‌ విమానం ఎగిరే అవకాశం

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

భోగాపురం, నవంబరు4(ఆంధ్రజ్యోతి): భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే కేంద్రబిందువు కానుందని పౌరవిమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. విమానాశ్రయ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఎప్పటిలోగా పూర్తి అవుతుందో అధికారులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇక నుంచి ఈ ప్రాంతంలో ఏఅభివృద్ధి జరిగినా ఎయిర్‌పోర్టును దృష్టిలో పెట్టుకొని పనులు సాగుతాయన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని సీఎం చాలెంజ్‌గా తీసుకొన్నారని, ఎన్ని సమస్యలు ఎదురైనా సకాలంలో పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో పని చేస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్టును వచ్చేఏడాది జూన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారని చెప్పారు. ఈఏడాది డిసెంబరు చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరి మొదట్లో ఎయిర్‌పోర్టులో విమానం ట్రయల్‌ రన్‌ జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఐదు స్టార్‌ హోటల్స్‌ కూడా వస్తున్నాయని, స్థానికుల టాలెంట్‌కు తగ్గ ఉపాధి దొరుకుతుందన్నారు. తద్వారా వలసలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఎయిర్‌పోర్టులో టాక్సీవే, రన్‌వేల పనులు నాణ్యతతో జరుగుతున్నాయని, నావిగేషన్‌, ట్రాఫిక్‌కంట్రోల్‌ పరంగా ఏవియేషన్‌ మినిస్ట్రీ నుంచి చేయాల్సినవన్నీ చేస్తామన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కన్నా ఇక్కడ ఎక్కువగా విమానాలు రాకపోకలు సాగించే విధంగా సన్నాహాలు చేస్తామని, ఇప్పటికే కొన్ని ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించామని చెప్పారు. ఎయిర్‌పోర్టు గ్లోబల్‌ స్టాండర్డ్స్‌తో నిర్మిస్తున్నామని, ఈనెలలో విశాఖలో నిర్వహించబోయే పారిశ్రామిక సదస్సులో ఏవియేషన్‌కు సంబంధించిన పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామన్నారు. అప్పటి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు పునాది వేసిన విమానాశ్రయం చివరిదశకు రావడం చాలా ఆనందాన్ని ఇస్తోందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఈప్రాంతం రూపురేఖలు మారిపోతాయని, అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి జీఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఎయిర్‌పోర్టుకు వేగంగా చేరుకొనేందుకు అవసరమైన కొత్త రహదారుల నిర్మాణం, ట్రంపెట్‌ బ్రిడ్జి తదితరవాటిపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట ఎంపీ కలిశెట్టిఅప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకంనాగమాధవి, కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్‌, ఆర్డీవో డి.కీర్తి తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 12:07 AM