Share News

ఆదమరిస్తే అంతే..

ABN , Publish Date - Apr 15 , 2025 | 10:57 PM

జిల్లాలోని పలు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గోతులు ఏర్పడి, రాళ్లు తేలి దారుణంగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రహదారుల నిర్వహణను గాలికొదిలేసింది.

ఆదమరిస్తే అంతే..
సాలూరు బంగారమ్మకాలనీ వద్ద పూర్తిగా పాడైన బీటీ రోడ్డు

- ప్రమాదకరంగా రోడ్లు

- గోతులు, రాళ్లతో దర్శనం

- కానరాని బెర్ములు

- ప్రజలకు తప్పని ఇబ్బందులు

సాలూరు/వీరఘట్టం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గోతులు ఏర్పడి, రాళ్లు తేలి దారుణంగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రహదారుల నిర్వహణను గాలికొదిలేసింది. దీనివల్ల అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా రోడ్లు బాగుపడుతున్నాయి. అయితే, ఇంకా చాలాచోట్ల గుంతలమయంగానే ఉన్నాయి. కొన్నిచోట్ల రోడ్లు నిర్మించి బెర్ములను ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనచోదకులు ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదానికి గురికాక తప్పదు. సాలూరు పట్టణంలోని బంగారమ్మకాలనీ సమీపంలో ఉన్న రోడ్డు పాడైపోవడంతో నిత్యం ద్విచక్ర వాహనదారులతో పాటు అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్సీఎం పాఠశాల సమీపంలోని రోడ్డుపై మలుపు వద్ద గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కోట వీధి జంక్షన్‌తో పాటు చిట్లు వీధి తదితర వీధుల్లో రోడ్లు గుంతలతో నిండిపోయాయి. సంబంధిత అధికారులు స్పందించి వాటిని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీరఘట్టం మండలంలోని కంబర, గడగమ్మ, ఎం.రాజపురం గ్రామాలకు ఇటీవల బీటీ రహదారులు నిర్మించారు. రోడ్లకు ఇరువైపులా మట్టితో బెర్ములు ఏర్పాటు చేసి ఒక మీటరు వెడల్పుతో గ్రావెల్‌ వేయాలి. కానీ, ఈ రోడ్లపై బెర్ములు లేకపోవడంతో ట్రాక్టర్లు, లారీలు కిందకు దిగే సమయంలో రహదారి అంచులు దెబ్బతింటున్నాయి. కొన్నిసార్లు ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ఐటీడీఏ ఏఈఈ సింధూజ మాట్లాడుతూ.. పరిశీలించి రోడ్లకు ఇరువైపులా బెర్మ్‌లు సక్రమంగా వేసేలా చూస్తామని తెలిపారు.

Updated Date - Apr 15 , 2025 | 10:57 PM