Share News

ఆ గంటే కీలకం!

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:24 AM

జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి గంట చాలా కీలకం.

    ఆ గంటే కీలకం!

- రోడ్డుప్రమాద క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్చి కాపాడండి

- పోలీసు కేసులు, కోర్టుల భయం వద్దు

- మంచి సమరయులుగా గుర్తింపు పొందండి

- రహ్‌-వీర్‌ పథకం ద్వారా నగదు బహుమతి అందుకోండి

- అవగాహన కల్పిస్తున్న పోలీసు శాఖ

- విశాఖపట్నంకు చెందిన సుబ్బారావు (అసలు పేరు కాదు) అనే వ్యక్తి ఇటీవల ద్విచక్ర వాహనంపై అరకు అందాలను చూసేందుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బొడ్డవర దాటిన తరువాత రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయనకు తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా అందరూ చూస్తున్నారే తప్ప ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సాహసించలేదు. కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుబ్బారావును ఆసుపత్రిలో చేర్చే సమయానికి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైనా ఆయన్ను ఆసుపత్రిలో చేర్చిఉంటే ప్రాణాలు నిలిచేవి.

శృంగవరపుకోట, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి గంట చాలా కీలకం. దీనినే గోల్డెన్‌ అవర్‌ అంటారు. వీరికి మొదటి గంటలో వైద్యం అందిస్తే సగం మరణాలను నివారించవచ్చు. అయితే, బాధితులు రక్తపు మడుగులో కనిపిస్తున్నప్పటికీ వారిని తాకేందుకు కూడా కొన్నిసార్లు ఎవరూ సాహసించడం లేదు. కొంత మంది 108కు సమాచారం ఇచ్చి ఊరుకుంటున్నారు. ఈ వాహనం ఒక్కోసారి ఆలస్యంగా వస్తుంది. క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో కొందరు మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు చేర్చడం, పోలీసులకు సమాచారం అందించడం వల్ల పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయమే ఇందుకు కారణం. అయితే, అలా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు అధికారులు. దీనికోసం రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ రహ్‌-వీర్‌ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రులకు తీసుకువచ్చే వారిని గుడ్‌ సమారిటన్‌గా (మంచి సమరయుడు) గుర్తించనుంది. వీరికి చట్టం ద్వారా రక్షణ కల్పించనుంది. రూ.5వేల నగదుతో పాటు ప్రశంసాపత్రం అందించనుంది. ఎక్కువ మంది కాపాడిన పది మందికి రూ.లక్ష అదనపు నగదు బహుమతులు ఇవ్వనుంది. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన ఒక వ్యక్తికి ఏడాదిలో గరిష్టంగా ఐదు సార్లు ఈ అవార్డును అందించనున్నారు.

ఎలాంటి ఒత్తిడి ఉండదు..

రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి తీసుకువచ్చిన వారికి సంబంధిత ఆస్పత్రి ధ్రువీకరణ పత్రం అందించాలి. ఆసుపత్రిలో చేర్చిన వారి పేరు, చిరునామా, తేదీ, సమయం, ప్రమాదం జరిగిన ప్రదేశం ఆ ధ్రువపత్రంలో ఉండాలి. వ్యక్తిగత సమాచారం చెప్పాలని పోలీస్‌ అధికారులు, ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి చేయకూడదు. బాధితులకు స్వచ్ఛందంగా సహాయం చేసేవారికి ఎలాంటి వేధింపులు ఉండవు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చిన వెంటనే వెళ్లిపోవచ్చు. వ్యక్తిగత వివరాలను చెప్పాల్సిన అవసరం లేదు. చికిత్సకు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇలా సకాలంలో ఆసుపత్రికి తీసుకొచ్చిన వారికి జాతీయ స్థాయి అవార్డు అందించనున్నారు. రాష్ట్ర స్థాయి మానటరింగ్‌ కమిటీ జాతీయ స్థాయి అవార్డుకు మూడు ఉత్తమ మంచి సమరయుల పేర్లను ప్రతిపాదిస్తుంది. కేంద్రం ప్రభుత్వం దేశంలోని అత్యుత్తమ పది మంది సమరయులను ఎంపిక చేస్తుంది. వీరికి ఒక్కొక్కరికి ధ్రువపత్రంతో పాటు రూ.లక్ష నగదు అందించనుంది. ప్రమాదానికి సాక్షిగా ఉండాలనుకునే వ్యక్తి మాత్రం పోలీసుల దర్యాప్తు కోసం తన పేరు, చిరునామా, ఇతర వివరాలను స్వచ్ఛందంగా ఇవ్వవచ్చు. ఈ సమాచారం అందరికీ తెలిసేలా జిల్లా పోలీస్‌ శాఖ అవగాహన కల్పిస్తోంది. దీనికి సంబంధించి వివిధ కూడళ్లలో ప్లెక్సీలను ఏర్పాటు చేస్తోంది. వీటిని పలువురు ఆసక్తిగా చదువుతున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం..

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించేందుకు ఆసుపత్రుల్లో చేర్చాలి. పోలీసులకు సమాచారం అందించాలి. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో మెలగాలి. బాధితుల ప్రాణాలను కాపాడిన వారికి నగదు బహుమతులు, అవార్డులు అందేలా ప్రోత్సహిస్తాం. వ్యక్తిగత వివరాలను అడగం. పోలీసుల వేధింపులు ఉండవు. ప్లెక్సీల ఏర్పాటు ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.

-వర్రి నారాయణ మూర్తి, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, శృంగవరపుకోట

Updated Date - Dec 27 , 2025 | 12:24 AM