Share News

TET టెట్‌ నోటిఫికేషన్‌ జారీ

ABN , Publish Date - Oct 24 , 2025 | 11:37 PM

TET Notification Released టీచర్లతో పాటు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు టెట్‌ రాయడానికి వీలుగా కన్వీనర్‌ కృష్ణారెడ్డి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ మేరకు డిసెంబరు 10న కంప్యూటర్‌ బేస్డ్‌గా పరీక్ష నిర్వహించనున్నారు.

 TET  టెట్‌  నోటిఫికేషన్‌ జారీ

  • వచ్చే ఏడాది జనవరి 19న ఫలితాలు

సాలూరు రూరల్‌, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): టీచర్లతో పాటు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు టెట్‌ రాయడానికి వీలుగా కన్వీనర్‌ కృష్ణారెడ్డి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ మేరకు డిసెంబరు 10న కంప్యూటర్‌ బేస్డ్‌గా పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 2011కి ముందు నియమితులై ఉద్యోగాలు చేస్తున్నవారు తప్పనిసరిగా టెట్‌ పరీక్ష రాయాల్సి ఉంది. ఇందు కోసం వచ్చే నెల 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 25న ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ మూడు నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 150 మార్కుల చొప్పున రెండు పేపర్ల (టెట్‌ 1ఏ, 2ఏ)ను రాయొచ్చు. కొందరు ఒకటే రాయవచ్చు. డిసెంబరు 10న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్‌, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహించ నున్నారు. ఏడాది జనవరి 2న టెట్‌ కీ విడుదల చేస్తారు. దానిపై అభ్యంతరాలను 9 వరకు స్వీకరించనున్నారు. తుది కీ వచ్చే 13న ప్రకటించనున్నారు. టెట్‌ ఫలితాలను 19న ప్రకటించనున్నారు. కాగా వచ్చే ఏడాది జనవరిలో మరో డీఎస్సీని ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో టెట్‌ అర్హత లేని నిరుద్యోగులు, సుప్రీం తీర్పు ప్రకారం ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు కలిపి టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీని ప్రకారం ఉమ్మడి జిల్లాలో సుమారు 8 వేల మంది వరకు టెట్‌ పరీక్షను రాయాల్సి ఉంది.

2009లో విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చింది. 2014, 2018, 2025 డీఎస్సీల్లో టెట్‌ అర్హత సాధించిన వారే ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు 2011 ముందు నియమితులైన వారు సైతం టెట్‌ అర్హత సాధించాలని తీర్పునిచ్చింది. ఐదేళ్లలోపు ( 2030 ఆగస్టు నాటికి ) పదవీ విరమణ చేయనున్నవారికి మినహాయింపు ఇచ్చింది. వారికి పదోన్నతి కావాలంటే టెట్‌ పరీక్షను రాయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు సైతం టెట్‌ నిర్వహించనుండడంతో వారిలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ, చెన్నైలో మాదిరిగా ఏపీ ప్రభుత్వం సైతం సుప్రీంలో రివ్యూ పిటిషను వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Updated Date - Oct 24 , 2025 | 11:37 PM