Tension in the jatara తీర్థంలో ఉద్రిక్తత
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:21 AM
Tension in the jatara గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం వద్ద అల్లరిమూకలను చెదరగొడుతున్న ఎస్‌ఐ బొడ్డు దేవిని స్థానిక యువకులు నిలదీశారు.

తీర్థంలో ఉద్రిక్తత
అల్లరి మూకలను చెదరగొట్టిన ఎస్‌ఐ
తనపై యువకులు దాడి చేశారని ఫిర్యాదు
తొమ్మిది మందిపై కేసు
వేపాడ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం వద్ద అల్లరిమూకలను చెదరగొడుతున్న ఎస్‌ఐ బొడ్డు దేవిని స్థానిక యువకులు నిలదీశారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య గొడవ పెరిగింది. ఈ క్రమంలో ఓ యువకుడు గాయపడడంతో పరిస్థితి అదుపు తప్పింది. తనపై దాడి చేసినట్లు ఎస్‌ఐ దేవి ఫిర్యాదు చేయడంతో 9 మంది యువకులను సీఐ అరెస్టు చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గుడివాడ గ్రామంలో జరుగుతున్న వేణుగోపాల స్వామి తీర్థమహోత్సవం పురష్కరించుకొని మంగళవారం రాత్రి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం అధికంగా హాజరయ్యారు. వేదిక వద్ద కొందరు యువకులు డ్యాన్సులు చేస్తూ ఇబ్బంది పెడుతున్నట్లు పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు వెళ్లింది. అదుపు చేసేందుకు గ్రామానికి చేరుకున్న వల్లంపూడి ఎస్‌ఐ దేవి అల్లరి చేస్తున్న యువకులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు గాయపడ్డాడు. అతని నుదిటిపై రక్తం రావడాన్ని చూసిన కొందరు యువకులు ఆగ్రహంతో ఎస్‌ఐను నిలదీశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్.కోట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు గ్రామానికి చేరుకొని అల్లరి మూకలను చెదరగొట్టారు. అల్లరికి కారుకులైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొమ్మిది మంది యువకులపై కేసు నమోదు చేశారు.
తొమ్మిది మందిని అరెస్టు చేశాం
అప్పలనాయుడు, సీఐ, ఎస్.కోట రూరల్
గుడివాడ గ్రామంలో ఎస్‌ఐ దేవి బందోబస్త్ విధులకు వెళ్లారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వేదికపై నృత్యం చేస్తున్న మహిళల పట్ల పలువురు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు గమనించారు. సరికాదని వారిని ప్రశ్నించగా గుడివాడ మోహన్, కళ్లేంపూడి విష్ణు, బూత్యాల దుర్గారావు, తలారి హర్షవర్ధన్, రొంగలి యెర్నిబాబు, సిమ్మ గౌరినాయుడు, గుడివాడ సంతోష్, గుడివాడ కిషోర్, గుడివాడ కృష్ణమ్మ, బూసరి సింహచలంనాయుడు మరికొంతమంది ఎస్‌ఐ దేవిపై దౌర్జన్యం చేశారు. విధులకు ఆటంకం కలిగించి భయభ్రాంతులకు గురి చేసినట్లు ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు. కొత్తవలస సీఐ షణ్ముఖరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తొమ్మిది మందిని అరెస్టు చేసి కొత్తవలస కోర్టుకు తరలించాం.