పెదఖండేపల్లిలో ఉద్రిక్తత
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:11 AM
పెదఖండేపల్లిలో సర్పంచ్ యాళ్ల రమణ అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఎస్.కోట రూరల్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పెదఖండేపల్లిలో సర్పంచ్ యాళ్ల రమణ అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గతంలో జిందాల్‌కు కేటాయించిన భూములకు సంబంధించి అప్పట్లో చేసిన గ్రామసభ తీర్మానాలు రద్దు చేయాలని, ప్రభుత్వం ఈ భూముల్లో ఏర్పాటుచేస్తామన్న ఎంఎస్ ఎంఈ పార్కులపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ తీర్మానా లు ప్రవేశపెట్టేందుకు సర్పంచ్ రమణ సిద్ధమయ్యారు. ఈమేరకు సోమవారం గ్రామసభ ఏర్పాటు చేయదలి చారు. అయితే ముందురోజు రాత్రి.. మరునాడు కలెక్టర్ వద్దకు రావాలని ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి సర్పంచ్‌కు తెలియజేశారు. అయినాసర్పంచ్ గ్రామసభ ఏర్పాటుపై ముందుకు వెళ్లారు. ఈక్రమంలో సోమవారం ఉదయం 10గంటల సమయంలో సీఐ నారాయణమూర్తి తన సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. సర్పంచ్ రమణను పోలీస్ జీపులో స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎంపీపీ సోమేశ్వరరా వు, పలు పంచాయతీల ప్రజాప్రతినిధులు చేరుకుని పోలీసుల తీరు రాజ్యంగ విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే సమయంలో ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ తీర్మానాలకు సిద్ధమయ్యారు.
తమ సర్పంచ్‌ను పోలీసులు అకారణంగా అరెస్టు చేయడం మీడియాలో రావడంతో హోంమంత్రి అనిత స్పందించారు. ఎమ్మెల్సీ రఘురాజుతో ఫోన్‌లో మాట్లాడా రు. గ్రామసభ ఏర్పాటుకు సహకరిస్తామని.. చేస్తున్న తీర్మానాలు ఆపేయాలని ఆమె కోరారు. దీంతో ఎమ్మెల్సీ మాట్లాడుతూ పోలీసులు ఎంతో అవమానకరమైన రీతిలో సర్పంచ్‌ను అరెస్ట్ చేశారని, అంతే గౌరవంగా గ్రామానికి తీసుకురావాలని కోరారు. ఈ విషయంపై తాను ఎస్పీతో చెప్పి విడుదల చేయిస్తానని హోంమం త్రి చెప్పడంతో ఆయన అంగీకరించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సర్పంచ్‌ను పోలీసులు విడిచిపెట్టారు.
సర్పంచ్ రమణ అరెస్టుపై ఎంపీపీ సోమేశ్వరరావు విలేకర్లతో మాట్లాడుతుండగా పోలీసు లు వచ్చి వీడియోలు తీశారు. దీనిపై ఎంపీపీ అభ్యంత రం తెలిపారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసు కుంది. తాను ఒక దళిత ఎంపీపీ కావడం వల్లే పోలీసుల తీరు ఇలా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎస్పీకి ఫిర్యాదు చేశాం
తన అరెస్టుపై సర్పంచ్ రమణ మాట్లాడుతూ ప్రజల కోరిక మీద గ్రామసభకు సిద్ధమయ్యామని, ఇంతలో పోలీసులు వచ్చి, తన మెడపై చేయివేసి, పద.. స్టేషన్ కు అని తీసుకెళ్లడం బాధించిందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం దృష్టిలో పెడతామన్నారు. ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.