'Ten' times of good should happen.. ‘పది’ంతలు మేలు జరగాలని..
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:48 PM
'Ten' times of good should happen.. పదోతరగతిలో మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి జరగనున్న పరీక్షలను దృష్టిలో పెట్టుకుని వందరోజుల ప్రణాళికను తయారుచేసింది.
‘పది’ంతలు మేలు జరగాలని..
టెన్త్ విద్యార్థులకు వందరోజుల ప్రణాళిక
నిర్దేశించిన ప్రభుత్వం
అమలు చేయాలని డీఈవోలకు ఆదేశం
ఈ నెల ఆరు నుంచే కార్యాచరణ
పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
రాజాం రూరల్, డిసెంబరు 9(ఆంరఽధజ్యోతి):
పదోతరగతిలో మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి జరగనున్న పరీక్షలను దృష్టిలో పెట్టుకుని వందరోజుల ప్రణాళికను తయారుచేసింది. వాటి అమలు బాధ్యతను జిల్లా విద్యాశాఖాధికారులకు అప్పగించింది. ఆ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ను ఈనెల 6 నుంచే అమలు చేస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయులు భాగస్వాములయ్యారు. ఈ ఏడాది పదోతరగతిలో శతశాతం ఫలితాలు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసిన నేపథ్యంలో జిల్లావిద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు ఇప్పటికే అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బందికి సూచనలిచ్చారు. అమలు దిశగా కృషిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉపాధ్యాయుల బాధ్యతలు
- విద్యార్థులను ఏ, బి, సి. గ్రేడులుగా విభజించి సి. డి. గ్రేడుల్లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
- అలాంటివారిని ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా దత్తత తీసుకుని వారికి ప్రత్యేక మెటీరియల్ అందించాలి.
- రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు పీరియడ్లు, స్టడీ అవర్స్, చివరిగా స్టిప్‌టెస్ట్‌లు నిర్వహించాలి.
- పాఠ్యాంశ నిపుణులు తయారుచేసిన ప్రశ్నాపత్రాలను ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో తీసుకుని విద్యార్థులతో పరీక్షలు రాయించాలి.
- 2026 జనవరి, ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్, మార్చిలో గ్రాండ్‌టెస్ట్ నిర్వహించాలి. మార్చిలో జరిగే తుది పరీక్షల వరకూ రోజూ నమూనా పరీక్షలు నిర్వహించాలి.
విద్యార్థులు పాటించాల్సిన నియమాలు
- ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి చదువుకోవాలి.
- క్లిష్టమైన పాఠ్యాంశాలను రెండుమూడు విభాగాలుగా విభజించుకుని రివిజన్ చేయాలి. మిగిలిన వాటిని నిత్యం చదవడానికి కేటాయించాలి.
- గత పబ్లిక్ పరీక్షలలో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు చదివి సాధన చేయాలి.
- బిట్ పేపర్‌పై ప్రత్యేకశ్రద్ధ చూపాలి. పాఠ్యాంశాలపై ఉన్న సందేహాలను సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలి.
- సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి.
అక్రమాలకు అవకాశం లేకుండా...
పదోతరగతి పరీక్షలలో అక్రమాలకు అవకాశం లేకుండా రాష్ట్ర విద్యాశాఖ కొత్తవిధానానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో సిబ్బంది నియామకాలు చేపట్టనున్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల నియామకంతో పాటు పేపర్ల వేల్యుయేషన్, విధుల కేటాయింపు ఇకపై విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచే జరగనున్నాయి.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
యు.మాణిక్యంనాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి
వచ్చే ఏడాది మార్చి 16 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షలకు జిల్లాలోని 279 పాఠశాలల్లో చదువుతున్న 23,311 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో సి.,డి. గ్రేడుల్లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ధ పెడుతున్నాం. గతంకన్నా మెరుగైన ఫలితాల సాధనదిశగా పనిచేస్తున్నాం. ఇప్పటికే ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించాం. రాత్రివేళల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చాం.
--------------