Tejovathi Appointed టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా తేజోవతి
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:25 AM
Tejovathi Appointed as TDP Araku Parliamentary Constituency President టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం.తేజోవతి, దత్తి లక్ష్మణరావును నియమించారు. ఈ మేరకు ఆదివారం సీఎం చంద్రబాబునాయుడు జాబితాను ప్రకటించారు.
ప్రకటించిన అధిష్ఠానం
పార్వతీపురం, డిసెంబరు21(ఆంధ్రజ్యోతి): టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం.తేజోవతి, దత్తి లక్ష్మణరావును నియమించారు. ఈ మేరకు ఆదివారం సీఎం చంద్రబాబునాయుడు జాబితాను ప్రకటించారు. టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలుగా నియమితులైన ఎం.తేజోవతి ప్రస్తుతం గిరిజన సలహా మండలి సభ్యురాలుగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో సాలూరు లేదా పాలకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. దీనికోసం తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలేసి టీడీపీలో చేరారు. సీటు లభించకపోవడంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె కృషి చేశారు. కాగా అరకు పార్లమెంట్ పీఠం కోసం చాలామంది ప్రయత్నించారు. కానీ అధిష్ఠానం తేజోవతి వైపు మొగ్గు చూపింది. ఆమె భర్త ఏపీ ట్రాన్స్‌కో డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తేజోవతి పార్వతీపురంలో నివాసం ఉంటున్నారు. ఇక అరకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దత్తి లక్ష్మణరావు గతంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. టీడీపీ సీనియర్ నాయకుడిగా ఉంటూ గత ఎన్నికల్లో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి విజయం కోసం కృషి చేశారు. ప్రస్తుతం ఆయన జియ్యమ్మవలసలో ఉంటున్నారు.
పార్టీ బలోపేతమేలక్ష్యం
పార్వతీపురం, డిసెంబరు21(ఆంధ్రజ్యోతి): అరకు పార్లమెంట్ పరిధిలో టీడీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎం.తేజోవతి తెలిపారు. ఆదివారం పార్వతీపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయచంద్రతో కలిసి విలేఖర్లతో మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో అరకు పార్లమెంట్ అధ్యక్ష పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అరకు పార్లమెంట్‌లో విస్తృతంగా పర్యటించి.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడించారు. సామాన్య కార్యకర్త నుంచి నాయకుల వరకు అందర్నీ సహకారం తీసుకుంటూ.. తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తానన్నారు.
అనంతరం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనమే తేజోవతి నియామకమని తెలిపారు. పార్టీ అధిష్ఠానం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అరకు పార్లమెంట్ అధ్యక్ష పీఠానికి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పెద్దఎత్తున కసరత్తు జరిగిందన్నారు. త్రిసభ్య కమిటీతో పాటు ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించి.. తేజోవతిని అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా నియమించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత కార్యాలయంలో కేక్ కటింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర, ఇతర నాయకులు కేక్ తినిపించి తేజోవతికి అభినందనలు తెలిపారు.