Share News

టార్గెట్‌.. రూ.15 లక్షలు!

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:48 PM

వారంతా చిరుద్యోగులు. ఆప్కాస్‌ కింద ఇటీవలే ఉద్యోగాల్లో చేరారు.

టార్గెట్‌.. రూ.15 లక్షలు!

- ఫార్మాలటీస్‌ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు..

- సబార్డినేట్‌కు పురమాయింపు

- ఓ అధికారి అంతర్గత ఆదేశాలు

- ఆందోళనలో కేజీబీవీ నాన్‌టీచింగ్‌ సిబ్బంది

మెంటాడ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): వారంతా చిరుద్యోగులు. ఆప్కాస్‌ కింద ఇటీవలే ఉద్యోగాల్లో చేరారు. అత్తెసరు జీతాలే అయినా ప్రస్తుతానికి ప్రత్యామ్నాయం లేక ఈ ఉద్యోగాలను ఎంపిక చేసుకున్నారు. బతుకుతెరువు కుదిరిందన్న సంతోషంలో పిడుగుపాటు వంటి వార్త వారిని ఆందోళనకు గుర్తిచేస్తోంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు ఫార్మాలిటీస్‌ కింద కొంత మొత్తం ఇవ్వాలని జిల్లా కేంద్రంలోని ఓ అధికారి నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. రూ.15 లక్షలు టార్గెట్‌గా నిర్ణయించారని, ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల చొప్పున వసూలు చేసే బాధ్యతను తన సబార్డినేట్‌కు అప్పగించారని సమాచారం. తమ జీతాలు అంతంత మాత్రమేనని, అంతా మొత్తం ఎలా ఇవ్వగలమని ఆ చిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఇటీవల కొంతమంది నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని అధికారులు నియమించారు. సర్వశిక్ష అభియాన్‌ ఆధ్వర్యంలో మొత్తం 55 ఖాళీలను భర్తీచేశారు. వీటిలో టైప్‌-3 కుక్‌లు 7, చౌకీదార్‌ 6 పోస్టులు కూడా ఉన్నాయి. అయితే విధుల్లో చేరిన వీరి నుంచి ఓ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫార్మాలిటీస్‌ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు డిమాండ్‌ చేస్తుండడంతో ఏం చేయాలో తెలియక చిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నెలకు ఏడెనిమిది వేల రూపాయల జీతం కూడా పొందని తమను అంతేసి మొత్తం ఇమ్మంటే ఎక్కడినుంచి తేగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారి నిర్దేశించిన రూ.15 లక్షల టార్గెట్‌ను సాధించి ఆ మొత్తాన్ని, ఆయన చేతిలో పెట్టే బాధ్యతను అదే కార్యాలయంలో ఎప్పటినుంచో తిష్ఠవేసిన సబార్డినేట్‌ తీసుకున్నట్లు తెలిసింది. ఆయన కలెక్షన్‌ స్పీడ్‌ పెంచడంతో ఆ 55 మంది సిబ్బంది డబ్బులు చెల్లించేందుకు అప్పుల వేటలో పడినట్టు తెలుస్తోంది.

వసూలు చేస్తే సస్పెండ్‌ చేస్తా

ఫార్మాలటీస్‌ పేరుతో కేజీబీవీ సిబ్బంది నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు నా దృష్టికి రాలేదు. అటువంటిది జరిగితే బాధితులు ఆధారాలతో నేరుగా నాకు ఫిర్యాదు చేయాలి. విచారణలో రుజువైతే తక్షణమే సస్పెండ్‌ చేస్తా. ఎవరూ లంచాలు ఇవ్వనవసరం లేదు.

-రామారావు, ఏపీసీ, జిల్లా సర్వ శిక్ష అభియాన్‌

Updated Date - Nov 07 , 2025 | 11:48 PM