BC loans: లక్ష్యం 1413 .. మంజూరు 224
ABN , Publish Date - May 02 , 2025 | 12:07 AM
BC loans: బీసీ రుణాల మంజూరుకు బ్యాంకులు కొర్రీలు పెడుతున్నాయి.
-ఇదీ బీసీ రుణాల మంజూరు పరిస్థితి
-వివిధ కారణాలతో బ్యాంకుల కొర్రీలు
-సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని దరఖాస్తుల తిరస్కరణ
-ఆందోళనలో లబ్ధిదారులు
-ప్రభుత్వం స్పందించాలని విన్నపం
పార్వతీపురం, మే 1(ఆంధ్రజ్యోతి): బీసీ రుణాల మంజూరుకు బ్యాంకులు కొర్రీలు పెడుతున్నాయి. గతంలో మంజూరైన రుణాలను చూపించడంతో పాటు డిఫాల్టర్ పేరిట సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని కొన్నిచోట్ల దరఖాస్తులను తిరస్కరిస్తున్నాయి. పూర్తిస్థాయిలో రుణాలు మంజూరు చేసేందుకు ఆమోదం తెలపడం లేదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆవేదన చెందు తున్నారు. మొత్తంగా బ్యాంకుల తీరుతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారే పరిస్థితి కనిపిస్తోంది.
ఇదీ పరిస్థితి..
- గత వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా పేదలకు ఎటువంటి రుణాలు మంజూరు చేయలేదు. దీంతో జిల్లాలో ఎంతోమంది స్వయం ఉపాధి పొందలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ రుణాలకు శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లావాసులు ఎంతో ఆనందించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సబ్సిడీ రుణాల కోసం అధికారులు పెద్దఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారులకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులకు దరఖాస్తులను పంపించారు. అయితే బ్యాంకులు మాత్రం కరుణించడం లేదు. సబ్సిడీ రుణాలకు మోకాళ్లలడ్డు తున్నాయి. దీంతో లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సి వస్తోంది. బ్యాంకర్ల తీరుతో మరోవైపు మండల , జిల్లా అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.
- జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా 1413 మంది లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారుల దరఖాస్తులను బ్యాంకులకు పంపించారు. అయితే ఇప్పటివరకు కేవలం 224 మంది లబ్ధిదారులకే బ్యాంకులు విల్లింగ్ ఇచ్చాయి. మిగిలిన దరఖాస్తుల్లో కొన్ని పెండింగ్‌లో ఉండగా మరికొన్నింటిని బ్యాంకులు వివిధ కారణాలతో తిరస్కరించాయి.
మండలాల్లో ఇలా...
- వీరఘట్టం మండలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు 92 మందిని అధికారులు ఎంపిక చేశారు. వారి దరఖాస్తులను బ్యాంకులకు పంపిస్తే ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారునికి కూడా రుణం మంజూరు చేయలేదు.
- మక్కువ మండలంలో 72 దరఖాస్తులు బ్యాంకులకు పంపించగా 16 మందికి మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపాయి.
- కొమరాడ మండలంలో 50 మంది దరఖాస్తులు బ్యాంకులకు వెళ్లగా కేవలం 8 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి.
- సీతానగరం మండలంలో 107 దరఖాస్తులు బ్యాంకులకు వెళ్లగా కేవలం 25 దరఖాస్తులకు మాత్రమే బ్యాంకులు ఆమోదం తెలిపాయి.
- బలిజిపేట మండలంలో 126 దరఖాస్తులు బ్యాంకులకు వెళ్లగా కేవలం ఏడుగురికి మా త్రమే రుణాలు చేశారు.
- గరుగుబిల్లి మండలంలో 118 దరఖాస్తులకు గాను 46 మందికి రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు అంగీకరించాయి.
- పాచిపెంట మండలంలో 38 దరఖాస్తులకు గాను 18 మందికి బ్యాంకులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి.
బ్యాంకులతో సంప్రదిస్తున్నాం
జిల్లాలో 1413 యూనిట్లకు సంబంధించి ఇప్పటివరకు 224 యూనిట్లకు బ్యాంకులు ఆమోదం తెలిపాయి. మిగిలిన యూనిట్ల రుణాల మంజూరు కోసం బ్యాంకులతో సంప్రదిస్తున్నాం. డిఫాల్టర్ పేరిట సివిల్ స్కోర్ తక్కువగా ఉందని బ్యాంకర్లు కొన్ని దరఖాస్తులు తిరస్కరించడం వాస్తవమే. ఎంపీడీవోలు బ్యాంకులతో మాట్లాడి ఆయా దరఖాస్తులను ఆమోదించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటాం.
- గడ్డెమ్మ, ఈడీ, బీసీ కార్పొరేషన్