Share News

టంగుటూరి జీవితం భావితరాలకు ఆదర్శం

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:30 AM

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం భావితరాలకు ఆదర్శమని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు.

  టంగుటూరి జీవితం భావితరాలకు ఆదర్శం
టంగుటూరి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌

- జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం కలెక్టరేట్‌, ఆగస్టు 23 ( ఆంధ్రజ్యోతి): ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం భావితరాలకు ఆదర్శమని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో టంగుటూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్‌ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికంలో పుట్టి, పూట కూళ్లల్లో పనిచేస్తూ, ఉన్నత విద్యావంతునిగా, పత్రికా సంపాదకునిగా, ప్రజా నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోఽ దుడిగా, ముఖ్యమంత్రిగా ఎదిగి.. సంపాదించిన దాన్ని ప్రజలకే పంచిపెట్టి పేదవారిగా మరణించిన మహానీయుడు టంగుటూరి అని కొనియాడారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ మాట్లాడుతూ.. సైమన్‌ గో బ్యాక్‌ నినాదంతో బ్రిటీష్‌ వారికి ఎదురొడ్డి గుండె చూపిన ధైర్యశాలి టంగుటూరి అన్నారు. రైతుల కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టారని, వాటి ఫలాలను రైతులు నేడు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో శ్రీనివాసమూర్తి, కలెక్టరేట్‌ ఏవో తాడ్డి గోవింద, సీపీవో బాలాజీ, వ్యవసాయాధికారి తారకరామారావు, మార్కెట్‌ ఫెడ్‌ డీఎం వెంకటేశ్వరరావు, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:30 AM