talli ki vandhanam… తల్లికి వందనం.. కుటుంబాల్లో ఆనందం
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:26 AM
talli ki vandhanam… Joy in the Families రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో మరొక కీలక పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ‘తల్లికి వందనం’ పేరిట శుక్రవారం తల్లుల ఖాతాలకు నగదు జమ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటికి కేవలం ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకం వర్తింపజేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది చదివితే అందరికీ పథకం వర్తింపజేశారు.
ఒక్కో కుటుంబంలో నలుగురు నుంచి ముగ్గురు పిల్లలకూ లబ్ధి
ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న తల్లులు
ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
పార్వతీపురం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో మరొక కీలక పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ‘తల్లికి వందనం’ పేరిట శుక్రవారం తల్లుల ఖాతాలకు నగదు జమ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటికి కేవలం ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకం వర్తింపజేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది చదివితే అందరికీ పథకం వర్తింపజేశారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి నగదు జమ చేశారు. ఇద్దరే కాదు నలుగురు పిల్లలున్నా కూడా ఒక్కొక్కరికీ రూ.13 వేల చొప్పున అందించారు. దీంతో తల్లులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు మేలు మరువలేమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా జిల్లాలో 1,08,951 మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఈ మేరకు 69,600 తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో నలుగురు పిల్లలున్న వారికి రూ.52 వేలు చొప్పున, ముగ్గురు సంతానం ఉన్నవారికి రూ.39 వేలు, ఇద్దరు పిల్లలున్న వారికి రూ.26 వేలు చొప్పున నగదు జమైంది. దీంతో తల్లుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వాస్తవంగా తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క విద్యార్థికి రూ.15 వేలు అందజేయాల్సి ఉండగా.. పాఠశాలలు, వాటిల్లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.2వేలు మినహాయించారు. మిగతా రూ.13 వేలను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
జాబితాలో పేరు లేకున్నా.. నో టెన్షన్
సాలూరు రూరల్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి ): అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లి వందనం పథకం వర్తింపజేయడానికి అధికారులు కార్యాచరణ చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలున్నప్పటికీ వాటిల్లో కొద్దిమంది పేర్లు లేవు. దీనికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పథకానికి అర్హులై ఉండి, జాబితాలో పేర్లు లేని వారికి కూడా తల్లికి వందనం కింద నగదు అందించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇటవంటి వారి వివరాలను తక్షణమే సేకరించి యుద్ధప్రాతిపదికన ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయించాలని ఎంఈవోలను డీఈవో రాజ్‌కుమార్ ఆదేశించారు. విద్యార్థి తండ్రి లేదా తల్లి ఆధార్ నెంబర్ లేకపోవడం వంటి సమస్యలను ఆయా పాఠశాలల హెచ్‌ఎంలతో మాట్లాడి ఆప్‌డేట్ చేసేందుకు ఎంఈవో చొరవ తీసుకోవాలని సూచించారు.
నలుగురికీ ఇచ్చారు..
సాలూరు రూరల్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలం తోణాం పంచాయతీ కేంద్రంలో పూజారి లక్ష్మి, ఉదయ్ దంపతుల నలుగురు పిల్లలు సాలూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఉదయ్ ఆటో మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లక్ష్మి గృహిణిగా ఉంది. కాగా వారి పిల్లల్లో మహిమ ప్రసన్న 9వ తరగతి, హనీ 7వ తరగతి , జేమీమా 4వ తరగతి , బ్లేసన్ 2 వ తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి రూ. 13 వేల చొప్పున మొత్తంగా రూ. 52 వేలు బ్యాంకు ఖాతాలో జమైనట్లు ఆమె మొబైల్‌కు సందేశం వచ్చింది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పినట్టే అందరికి పిల్లలకు తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చారని తెలిపారు.
చెప్పినట్టే ఇచ్చారు..
కురుపాం రూరల్, జూన్13(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం మొండెంఖల్ గ్రామానికి చెందిన కుమ్మరి శివన్నారాయణ, ఊర్మిళ దంపతులకు ముగ్గురు సంతానం. వారి పెద్ద కుమారుడు జశ్వంత్ బొబ్బిలిలో 8వ తరగతి, దీక్షిత మొండెంఖల్‌లో 5వ తరగతి, శేషగిరి అదే గ్రామంలో 3వ తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పఽథకంలో భాగంగా ఊర్మిళ ఖాతాలో శుక్రవారం రూ. 39 వేలు జమ అయ్యాయి. దీంతో ఊర్మిళ ఆనందం వ్యక్తం చేశారు. తమ పిల్లలను బాగా చదివించేందుకు ఈ డబ్బులు ఎంతగానో దోహదపడతాయని ఆమె తెలిపింది. ‘ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుంది. చాలా ఆనందంగా ఉంది. సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన విధంగానే ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలుంటే అందరికీ పథకం వర్తింపజేశారు. ఆయన మేలు మరువలేం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.’ అని ఊర్మిళ తెలిపారు.