4జీ టవర్ల పనులు చేపట్టండి
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:46 PM
జిల్లాలో గుర్తించిన గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్, జియో 4జీ టవర్ల ఏర్పాటు పనులను వెంటనే ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి సంబంధిత నెట్‌వర్క్ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు.
జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి
పార్వతీపురం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గుర్తించిన గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్, జియో 4జీ టవర్ల ఏర్పాటు పనులను వెంటనే ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి సంబంధిత నెట్‌వర్క్ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాలో 4జీ టవర్ల ఏర్పాటుపై బీఎస్‌ఎన్‌ఎల్, జియో ప్రతినిధులతో పాటు సబ్ కలెక్టర్లు, ప్రత్యేక ఉపకలెక్టర్లు, తహసీల్దార్లు, ఇంజనీర్లు, అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొమరాడ మండలంలోని బద్దిడి, ఊటకోసు, తినుకు, ఊలిగేసు, వనబడి గ్రామాలు, సాలూరు మండలంలోని చోర, సురాపాడు, లోలింగభద్ర, గుమ్మలక్ష్మీపురం మండలంలోని వడబాయి, బయ్యాడ గ్రామాల్లో టవర్ల ఏర్పాటుకు సర్వే చేసినట్లు తెలిపారు. ఈ పది గ్రామాల్లో టవర్లకు సంబంధించిన మెటీరియల్‌ను వాహనాల్లో తీసుకెళ్లేందుకు రహదారి పనులు చేపట్టాలన్నారు. గుర్తించిన ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు అవకాశం లేకపోతే వాటికి బదులుగా ప్రత్యామ్నాయ గ్రామాలను గుర్తించి తక్షణమే ఆ వివరాలను తనకు పంపాలని జేసీ అధికారులను ఆదేశించారు.