Tahsildar's family trapped in floods వరదల్లో చిక్కుకున్న తహసీల్దార్ కుటుంబం
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:42 PM
Tahsildar's family trapped in floods సిక్కిం వరదల్లో విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు కుటుంబ సభ్యులు చిక్కుకున్నారు. అక్కడ మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తీస్తా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. రాకపోకలు నిలిచిపోవడంతో లాంచ్ గ్రామం వద్ద ఓ ప్రైవేటు హోటల్‌లో ఉండిపోయారు.
వరదల్లో చిక్కుకున్న తహసీల్దార్ కుటుంబం
గత నెల 27న సిక్కింలోని గ్యాంగ్‌టక్ పర్యాటక ప్రాంతానికి చేరిక
మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలు
ఉధృతంగా ప్రవహిస్తున్న తీస్తా నది
తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయనగరం కలెక్టరేట్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): సిక్కిం వరదల్లో విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు కుటుంబ సభ్యులు చిక్కుకున్నారు. అక్కడ మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తీస్తా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. రాకపోకలు నిలిచిపోవడంతో లాంచ్ గ్రామం వద్ద ఓ ప్రైవేటు హోటల్‌లో ఉండిపోయారు. తహసీల్దార్ కూర్మనాథరావు, భార్య ఉమా (డిప్యూటీ తహసీల్దార్), కుమార్తె దీక్షత, కుమారుడు జయష్ నారాయణ కలిసి గత నెల 27న సిక్కిం రాష్ట్రం గ్యాంగ్‌టక్ సందర్శనకు వెళ్లారు. ఆ ప్రాంతం చూశాక నార్త్ సిక్కిం నుంచి వచ్చేద్దామనుకున్న సమయంలో వర్షాలు మొదలయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురవడంతో తీస్తానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ పరిస్థితిలో లాంచ్ గ్రామం వద్ద ఒక ప్రైవేటు హోటల్‌లో కుటుంబ సభ్యులతో సురక్షితంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. దీనిపై కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా తహసీల్దార్‌తో మాట్లాడి అక్కడి స్థితిగతులను తెలుసుకున్నారు. వరద ఉధృతంగా ఉందని, ఎటువెళ్లాలన్నా రోడ్డు మార్గం లేదని, లోకల్ కానిస్టేబుల్ కూడా వచ్చారని తహశీల్దార్ కూర్మనాథరావు ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్‌లో తెలిపారు. తమతోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు, కర్నూల్‌కు చెందిన ఒకరు ఉన్నారని తెలిపారు.