సీఎం పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:11 AM
Swift Arrangements for CM’s Tour ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 5న భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో సీఎం పాల్గొనున్నారు. దీంతో అధికారులు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు.
భామిని ఆదర్శ పాఠశాలలో మరమ్మతు పనులు
హెలీప్యాడ్ స్థలం ఖరారు
పరిశీలించిన జేసీ, సబ్ కలెక్టర్
భామిని, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 5న భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో సీఎం పాల్గొనున్నారు. దీంతో అధికారులు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో మరమ్మ తు పనులు చేపట్టారు. రంగులతో కొత్త శోభను తీసుకొచ్చారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పరిశీలించారు. హెలీప్యాడ్‌ను సైతం భామిని మోడల్ స్కూల్ సమీపంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాలకొండ డీఎస్పీ రాంబాబుతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. బహిరంగ సభా వేదికకు సమీపంలోనే అనుకూలమైన ప్రాంతం ఉండడంతో ఆర్‌అండ్‌బీ ఈఈ ఎస్.రామచంద్రరావు హెలీప్యాడ్ పనులు చేపట్టారు. ఆ ప్రాంతంలో కంచె నిర్మాణంతో పాటు అవసరం మేరకు వాటరింగ్ చేపట్టాలని డీఎస్పీ ఆదేశించారు. ఆదర్శపాఠశాల, కళాశాల భవనంలోని అన్ని గదుల్లో రంగులు వేయాలని జేసీ సూచించారు. ఈ పరిశీలనలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సమగ్ర శిక్ష కమిషనర్ శ్రీనివాస్, విద్యాశాఖాధికారులు, ఇంజనీరింగ్, విద్యుత్‌శాఖాధికారులు ఉన్నారు.
4న లోకేశ్ జిల్లాకు రాక
పార్వతీపురం, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి): విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ జిల్లా పర్యటన ఖరారైంది. గురువారం రాత్రి ఏడు గంటలకు మంత్రి లోకేశ్ బత్తిలి-అలికాం రోడ్డు మీదుగా భామిని చేరుకుంటారు. రాత్రి 7.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు. భామిని మండలంలో రాత్రి బస చేయనున్నారు. శుక్రవారం భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించనున్న పీటీఎంలో లోకేశ్ పాల్గొంటారు. కాగా 5న సీఎం చంద్రబాబు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.