‘తీపి’కబురు ఎప్పుడో!
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:14 AM
'Sweet' talk ever! భీమసింగి చెక్కర కర్మాగారాన్ని 2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వం మూసేసింది. ఆధునికీకరించి తిరిగి తెరిస్తామని స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు నమ్మబలికారు. చెరకును పండించే రైతులు, కర్మాగారంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, కార్మికులు కూడా నిజమే అనుకున్నారు.
‘తీపి’కబురు ఎప్పుడో!
భీమసింగి చక్కెర కర్మాగారం తెరవాలంటున్న రైతులు
తాజాగా అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే లలితకుమారి
ఆధునికీకరణ పేరుతో నాలుగేళ్ల క్రితం మూసేసిన వైసీపీ
చెరకు రైతులకు ఇబ్బందులు
జీతాలు, పీఎఫ్‌లను చెల్లించక కార్మికులదీ ఇదే దుస్థితి
శృంగవరపుకోట, మార్చి 16(ఆంధ్రజ్యోతి):
- జామి మండలం భీమసింగి చక్కెర కర్మాగార కార్మికులను అదుకోవాలి. ఇందులో పనిచేసిన కార్మికులకు జీతాలు, పీఎఫ్‌లు చెల్లించాలి. దాదాపు ఆరు నియోజకవర్గాలకు చెందిన చెరకు రైతులకు ఈ కార్మాగారం జీవనాధారం. ఈ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. భవిష్యత్‌లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ద్వారా అయినా చక్కెర కర్మాగారం పునర్నిర్మాణానికి ప్రయత్నించాలి.
- ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఈనెల6న శాసన సభలో ప్రస్తావన
భీమసింగి చెక్కర కర్మాగారాన్ని 2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వం మూసేసింది. ఆధునికీకరించి తిరిగి తెరిస్తామని స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు నమ్మబలికారు. చెరకును పండించే రైతులు, కర్మాగారంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, కార్మికులు కూడా నిజమే అనుకున్నారు. ఆ ప్రభుత్వం ఐదేళ్లలో కర్మాగార ఆధునికీకరణకు ఒక్క రూపాయి కేటాయించలేదు. మూసేసిన ఒకట్రెండు సంవత్సరాల తరువాత కార్మికులు, రైతులు కార్మాగారాన్ని తెరిపించేందుకు రూ.5కోట్లు వరకు నిధులను కేటాయించాలని నేతలకు విన్నవించారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ఈ ప్రాంతానికి వచ్చే ప్రతి ప్రముఖునికీ కర్మాగార పరిస్థితిని గుర్తుచేసేవారు. నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరూ స్పందించలేదు. నేడు కర్మాగార యంత్రాలు పూర్తిగా పాడయ్యాయి. ఆధునికీకరణ అంచనా వ్యయం పెరిగింది. ఇప్పుడు కనీసం రూ.10 కోట్లకు పైబడి నిధులు అందిస్తే తప్ప పునర్నిర్మించడం కష్టం. కర్మాగారం తెరిచే అవకాశం లేక పది ఎకరాల చెరకు పండించే రైతు ఇప్పుడు మూడెకరాల చెరకునే సాగుచేస్తాన్నాడు. అలవాటైన చెరకు సాగును వదల్లేక పండిస్తున్న రైతులకు కష్టాలు వెంటాడుతున్నాయి. 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంకిలి చక్కెర కర్మాగారానికి పంటను తరలించాల్సి వస్తోంది. కర్మాగారంలో పనిచేసిన కార్మికులకు జీతాలు, పీఎఫ్‌లు వంటివి ఇవ్వక కుటుంబాలు వీధిన పడ్డాయి.
తాజాగా ప్రభుత్వం దృష్టికి
ఎమ్మెల్యే లలిత కుమారి భీమసింగి చక్కెర కర్మాగార పరిస్థితిని ఇటీవల శాసన సభలో ప్రస్తావించడంతో చెరకు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం నారాచంద్రబాబు నాయుడు, యువ నేత, మంత్రి నారా లోకేశ్‌లు అధికారంలోకి రాగానే భీమసింగి చెక్కర కర్మాగార సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తుండడంతో రైతులూ ఆశ పడుతున్నారు.
ఫ 1973లో విజయరామగజపతి చక్కెర కర్మాగారం పేరుతో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. గజపతినగరం, శృంగవరపుకోట విజయనగరం, నెల్లిమర్ల, చీపురపల్లి, విశాఖ జిల్లా భీమిలి నియోజకర్గాల పరిధిలోని 19 మండలాల రైతులు చెరకును ఇక్కడకు తీసుకొచ్చేవారు. చెరకు తరలించే ప్రతి రైతుకు షేర్లు ఉన్నాయి. పాలక మండలి చైర్మన్, డైరెక్టర్‌ల ఎన్నికలు జరిగేవి. రాజకీయ నాయకులు ఈ పదవుల కోసం తీవ్రంగా పోటీపడి, ఘర్షణలు పడిన సంఘటనలు ఉన్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు రైతులకు ఆసరాగా నిలిచిన ఈ కర్మాగారంపై గత పాలకుల నిర్లక్ష్యపు నీడ పడింది. మద్దతు ధర లేక రైతుకు గిట్టుబాటు లేకుండ పోయింది. దీంతో రైతులు కొంత చెరకును కర్మాగారానికి, మరికొంత చెరకును బెల్లంక్రషర్‌లకు సరఫరా చేయడానికి అలవాటు పడ్డారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన గత ప్రజా ప్రతినిధులు కర్మాగారాన్ని నిర్వీర్యం చేశారు. అటు తర్వాత పూర్తిగా మూతపడింది.
ఫ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ(చిన్న, మధ్య, సూక్ష్మ పరిశ్రమల)ల స్థాపనకు అసక్తి చూపుతోంది. భీమసింగి చక్కెర కర్మాగారాన్ని కూడా ఎంఎస్‌ఎంఈ జాబితాల్లో చేర్చడం ద్వారా కర్మాగార పునర్నిర్మాణానికి పూనుకోవాలని ఆ ప్రాంత చెరకు రైతులు కోరుతున్నారు.