Share News

Sweet not poison! మధురం కాదు విషం!

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:45 PM

Sweet not poison! మధురఫలంగా చెప్పుకునే మామిడి పండును చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. అయితే వాటిని చూసినంతనే కొనేసి తినేద్దామంటే ఇప్పుడున్న పరిస్థితిలో కుదరదు. మనం తింటున్న పండ్లు ఎంత వరకు సురక్షితమో ఒక్కసారి ఆలోచించాలి.

Sweet not poison! మధురం కాదు విషం!
మామిడి పండ్లపై రసాయనాలు స్ర్పే చేస్తున్న దృశ్యం

మధురం కాదు విషం!

మామిడిపంట్లపై రసాయనాల ప్రభావం

విషపూరితంగా మారుతున్న ఫలాలు

వ్యాపారుల నిర్వాకం.. ప్రజారోగ్యానికి ముప్పు

తనిఖీలు చేయని అధికారులు

మధురఫలంగా చెప్పుకునే మామిడి పండును చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. అయితే వాటిని చూసినంతనే కొనేసి తినేద్దామంటే ఇప్పుడున్న పరిస్థితిలో కుదరదు. మనం తింటున్న పండ్లు ఎంత వరకు సురక్షితమో ఒక్కసారి ఆలోచించాలి. సంప్రదాయ పద్ధతిలో పండ్లను మగ్గపెట్టకపోవడంతో మార్కెట్‌లో కొన్నప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. ఆ తర్వాత కూడా శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. సీజన్‌ దాదాపు చివరి దశకు చేరినప్పటికీ ఇంకా విస్తృతంగా అమ్మకాలు జరుగుతున్నాయి. అదే సమయంలో వాటిని కృత్రిమంగా మగ్గపెట్టడం కూడా మానడం లేదు. హోల్‌సేల్‌ వ్యాపారులు ఇథోపాన్‌ను లిక్విడ్‌ రూపంలో నేరుగా పండ్లపై స్ర్పే చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరమని వైద్యులు సూచిస్తున్నారు.

రాజాం, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి):

మామిడి సీజన్‌ చివరి దశకు చేరుకున్నప్పటికీ మార్కెట్లో పండ్లు విస్తృతంగా కనిపిస్తున్నాయి. కొనుగోలు అలాగే సాగుతోంది. అయితే వినియోగదారులు తగు జాగ్రత్తలు పాటించకుంటే రసాయనాలు, కీటకాలతో కూడిన అవశేషాలు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని ఆహార కల్తీ నియంత్రణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. కొందరు వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా చెట్టుపై కాయ పూర్తిపక్వానికి రాకుండానే.. వాటిని రైతుల నుంచి కొనుగోలు చేసి మార్కెట్‌కు తరలించి రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెడుతున్నారు. భారత ఆహార భద్రత చట్టం ప్రకారం అనుమతించిన దాని కంటే రసాయనాలను మితిమీరి వినియోగిస్తున్నారు.

మామిడి పంటను మగ్గబెట్టడానికి కార్బైడ్‌, ఇతర రసాయనాలను ఇది వరకూ ఉపయోగించేవారు. ఇప్పుడు ఇథోపాన్‌ రసాయనాన్ని వాడుతున్నారు. వాస్తవానికి ఇథలిన్‌ను వినియోగించడం ద్వారా 24 గంటల నుండి 48 గంటల్లో మామిడి కాయ రంగుమారుతుంది. ఇథోపాన్‌ నుంచి ఇథలిన్‌ గ్యాస్‌ వస్తుంది. ఈ గ్యాస్‌ ద్వారా కాయలను పండ్లుగా తయారు చేయవచ్చు కానీ వ్యాపారులు ఇథోపాన్‌ను లిక్విడ్‌ రూపంలో తీసుకువచ్చి నేరుగా పండ్లపై స్ర్పే చేస్తున్నారు. ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. పండ్లపై ఇథలిన్‌ 100 పిపిఎంకు మించి ఉండకూడదు. ఇథోపాన్‌ను నేరుగా స్ర్పే చేయడం వల్ల ఆ పరిధి దాటిపోతోంది. ఈ పరిస్థితిలో కొనుగోలుదారులు సునిశిత పరిశీలనతో మాత్రమే మామిడి పండ్లను కొనుగోలు చేయాలి. కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి పండ్లు బయటికి లేత పసుపుతో కనిపిస్తాయి. సహజంగా పండిన పండు బయట, లోపల ఒకే వర్ణంలో ఉంటుంది. రసాయనాల వినియోగంతో మామిడి నుంచి సహజంగా లభించే పోషకాలు నశిస్తాయి.

ఫ కాయలను కొనుగోలు చేసే వ్యాపారులు 24 గంటల్లోనే మేలిమి పండులా కపిపించేందుకు పరిమితికి మించి ఇథోపాన్‌ను వినియోగిస్తున్నారు. రసాయనాలు మార్కెట్‌లో చౌకగా లభిస్తుడటంతో వీటిని వ్యాపారులు యథేచ్ఛగా వాడుతున్నారు.

ఫ మగ్గబెట్టిన పండ్లు అధికంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌, అల్సర్‌, కాలేయం, మూత్ర పిండ సంబంధిత వ్యాధులు, జీర్ణ సంబంధిత వ్యాఽధులు, కాళ్లు చేతులకు తిమ్మిర్లు, నరాల బలహీనత తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఫ మామిడికాయలను మగ్గబెట్టేందుకు సంప్రదాయ విధానమే మంచిది. ఒక గదిలో దాదాపు 300 కాయలు ఉంచి ఇథలీన్‌ను శాస్త్రీయ పద్ధతలో వినియోగించి మగ్గబెట్టుకునేందుకు అనుమతి ఉంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఫ ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలు-2011 ప్రకారం పండ్లను కృత్రిమంగా పండించేందుకు ఉపయోగించే కార్బైడ్‌, ఎసిటిలిన్‌ రసాయనాలను ప్రభుత్వం నిషేధించింది. సహజంగా పండించడంలో కీలకపాత్ర పోషించే ఇథిలిన్‌ వాయువు (గ్యాస్‌) 100 పీపీఎం వరకు వినియోగించేందుకు అనుమతిచ్చింది.

ఫ సుమారు 20 కిలోల పండ్లను పండించేందుకు (మగ్గబెట్టేందుకు) 5 గ్రాముల ఇథిలిన్‌ను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఈ వాయువు 24 గంటలు మామిడి కాయలకు తగిలేలా ఉంచితే 5 రోజుల్లో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా పండుతాయి.

ఫ ఆహార సురక్ష ప్రమాణాల చట్టం-2006 ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను మగ్గించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్‌తో మగ్గబెట్టిన వారికి, అమ్మేవారికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.

ఆ పండ్లు తినకూడదు

మామిడి పండ్లు తొందరగా మగ్గాలనే ఆలోచనతో రసాయనాలు వాడుతున్నారు. ఆ మామిడి పండ్లు తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు ఎక్కువగా మామిడి మగ్గడానికి ఇథోపాన్‌ రసాయనాన్ని వాడుతున్నారు. పండ్లు కొన్నపుడు జాగ్రత్తగా పరిశీలించాలి.

గార రవిప్రసాద్‌, ప్రముఖ వైద్యుడు, రాజాం

Updated Date - Jun 23 , 2025 | 11:45 PM