దివ్యాంగులకు తీపి కబురు
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:16 AM
దివ్యాంగ మహిళలు, పిల్లలు, వృద్ధులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
రెట్రోఫిటెడ్ స్కూటర్లు, బ్యాటరీ వీల్‌చైర్లు అందించనున్న ప్రభుత్వం
శతశాతం రాయితీ
25వరకు దరఖాస్తుల స్వీకరణ
శృంగవరపుకోట, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగ మహిళలు, పిల్లలు, వృద్ధులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వీరికి మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెట్రోఫిటెడ్ స్కూటర్లు (మూడు చక్రాలు), బ్యాటరీతో పని చేసే వీల్ చైర్లను శతశాతం రాయితీపై అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. లబ్ధిదారుల వయసు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి. 70 శాతం కంటే ఎక్కువ లోకో మోటర్ వికలాంగత్వ ధ్రువపత్రం కలిగిఉండాలి. రాష్ట్రానికి చెందిన వారై ఉండడంతో పాటు రూ.3లక్షల కుటుంబ వార్షిక ఆదాయం మించరాదు. అనుకూల వాహనం నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా ఇంతకు ముందు ఏ మోటారు వాహనాన్ని పొందిఉండరాదు. లబ్ధిదారుని పేరుపై వాహనం ఉంటే అనర్హులు. ఒక్కసారి మాత్రమే ఈ ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంది. రెగ్యులర్ పద్ధతిలో గ్రాడ్యుయేషన్ అంతకంటే పైస్థాయి కోర్సులు చదివి ఉండాలి. కనీసం పదో తరగతి విద్యార్హతతో స్వయం ఉపాధి, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పించనున్నారు. ఈ విషయమై శృంగవరపుకోట ఎంపీడీవో సతీష్ మాట్లాడుతూ.. ఠీఠీఠీ.్చఞఛ్చీటఛ్చిఛి.్చఞ.జౌఠి.జీుఽ ద్వారా దరఖాస్తులు పంపాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుందని తెలిపారు.
జతచేయాల్సిన ధ్రువపత్రాలు
దివ్యాంగుల ధ్రువపత్రం (వైద్యఆరోగ్య శాఖ జారీ చేసిన సదరం)
ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధువపత్రాలు
పదో తరగతి సర్టిఫికెట్
బోన్‌ఫైడ్ సర్టిఫికెట్ (విద్యార్థులు)
ఉపాధి ధ్రువపత్రం (స్వయం ఉపాధి, ఉద్యోగులు)
పాస్‌పోర్టు సైజ్ ఫొటో