Canal! కాలువ మింగేసింది!
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:12 AM
Swallowed by the Canal! కొమరాడ మండలంలో జంఝావతి ఘటన మరువకముందే గరుగుబిల్లిలో మరో విషాదం చోటుచేసుకుంది. స్నానానికని నాగావళి ఎడమ కాలువలో దిగి ప్రమాదవశాత్తూ ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు.
గరుగుబిల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలంలో జంఝావతి ఘటన మరువకముందే గరుగుబిల్లిలో మరో విషాదం చోటుచేసుకుంది. స్నానానికని నాగావళి ఎడమ కాలువలో దిగి ప్రమాదవశాత్తూ ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. గరుగుబిల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోటపల్లి పంచాయతీ నందివానివలస గ్రామానికి చెందిన మణికంఠ (17) కురుపాం కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రోజూలానే సోమవారం ఉదయం స్నేహితులతో కలిసి తోటపల్లి జడ్పీ హైస్కూల్ వైపు వాకింగ్‌కు వెళ్లాడు. కొంత సేపటి తర్వాత స్నానం చేసేందుకు నాగావళి ఎడమ కాలువలో ఆ విద్యార్థి దిగాడు. అయితే కాలు జారి కాలువలోని గోతిలో చిక్కుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులు ఎన్.మహేష్, జి.సాయితేజ, పి.యశ్వంత్‌లు మణికంఠను రక్షించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రవికుమార్, చిన్నమ్మ, సోదరి హుటాహుటిన ఆప్రాంతానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో గోతిలో చిక్కుకున్న మణికంఠ మృతదేహాన్ని బయటకు తీయించారు. విగతజీవిగా పడి ఉన్న తనయుడిని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. పోలీస్ ఉద్యోగం సాధించి... కుటుంబానికి అండగా ఉంటాన్న కుమారుడు ఇక లేడని తేలిసి వారు కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ ఎన్.ఈశ్వరరావు తెలిపారు.