Suspicion.. a monster అనుమానం.. పెనుభూతం
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:54 PM
Suspicion.. a monsterనూరేళ్లు సాఫీగా సాగాల్సిన దాంపత్య జీవితం అర్ధాంతరంగా ముగుస్తోంది. మూడుమళ్ల బంధం కట్టుతప్పి ‘ముల్ల’బంధం అవుతోంది. పెళ్లి నాట చెప్పుకునే బాసలు ఆ తర్వాత మోసాలవుతున్నాయి.
అనుమానం.. పెనుభూతం
దంపతుల మధ్య చిచ్చు
ప్రాణాలను బలిగొంటున్న అనైతిక బంధాలు
వివాహేతర సంబంధాలతో హత్యలు
అనాథలవుతున్న పిల్లలు
- ఈనెల 9న బొండపల్లి మండలంలోని ఓ గ్రామంలో హత్య జరిగింది. మేనల్లుడితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసి నిలదీసిన భర్తను ఇద్దరూ కలిసి మరొకరి సాయంతో అంతమొందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తులో అసలు విషయం గుర్తించారు.
- ఫిబ్రవరి 9న దత్తిరాజేరు మండలంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. పొలానికి వెళుతున్న ఆమెను భర్తే వెంటాడి వేటాడి చంపాడు. వారికి వివాహితులైన కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
- గత ఏడాది జూన్ 23న గజపతినగరం మండలంలో ఓ నవ వధువు దారుణ హత్యకు గురైంది. అక్కడకు వారం రోజుల ముందే ఆమెకు వివాహమైంది. భార్యపై అనుమానంతో నైలాన్ తాడును మెడకు బిగించి దారుణంగా హత్యచేశాడు. పోలీసుల విచారణలో నిజాన్ని అంగీకరించాడు.
విజయనగరం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి):
నూరేళ్లు సాఫీగా సాగాల్సిన దాంపత్య జీవితం అర్ధాంతరంగా ముగుస్తోంది. మూడుమళ్ల బంధం కట్టుతప్పి ‘ముల్ల’బంధం అవుతోంది. పెళ్లి నాట చెప్పుకునే బాసలు ఆ తర్వాత మోసాలవుతున్నాయి. భార్య,భర్త మధ్యలోకి అనుమానం అనే పెనుభూతం చేరుతుండడమే ఈ పరిస్థితి కారణం. అనైతిక బంధాలు, వివాహేతర సంబంధాలు వారిని విడదీస్తున్నాయి. అన్యోన్యదంపతుల మధ్య ఒకసారి వివాదం మొదలైతే అది చినికి చినికి గాలివానలా మారి ఒకరినొకరు అంతమొందించే వరకూ వెళ్తోంది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేక క్షణికావేశానికి గురై హత్యలకు తెగబడుతున్నారు. ఈ పరిణామాలతో పిల్లలు అనాథలవుతున్నారు. సమాజంలో వారు చిన్నబోయేలా చేస్తున్నారు. మనిషిలో మానవతా విలువలు తగ్గిపోవడం వల్ల కూడా అనర్థాలు జరుగుతున్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించే బాధ్యతను పెద్దలు తీసుకునేవారు. నయానో.. భయానో దారిలోకి తెచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు సమస్య వారి వద్దకే వెళ్లడం లేదు. కొంప మునిగాక వారికి తెలుస్తోంది. చిన్న కుటుంబాలు కావడంతో ఎవరి జీవితం వారిది అన్నట్టు భార్య, భర్తతో పాటు పిల్లలు వ్యవహరిస్తున్నారు. ఏది మంచి? ఏది చెడు? జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవడం ఎలా? అనేది ఎవరికీ తెలియడం లేదు. ఈ వాతావరణమే పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగడానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
పచ్చటి జీవితంలో ‘సెల్’ చిచ్చు..
పెరుగుతున్న టెక్నాలజీ సమాజంలో రుగ్మతలకు కారణం అవుతోంది. సెల్‌ఫోన్లు పచ్చటి జీవితంలో చిచ్చు రేపుతున్నాయి. అనైతిక బంధాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఫోన్లలో పరిచయమైన అపరిచిత వ్యక్తులతో మాటలు కలపడం, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకోవడంతో ప్రారంభమై అనేక అనర్థాలకు కారణమవుతున్నాయి. వివాహేతర సంబంధాలు సజావుగా సాగుతున్న సంసారాల్ని చిత్రహింసల పాలు చేస్తున్నాయి. ఆపై హత్యలకు దారితీసి చివరికి కటకటాలపాలవుతున్నారు. హత్యలకు సహకరించిన స్నేహితులకూ శిక్షలు పడుతున్నాయి. వారి కుటుంబాలు సైతం వీధినపడుతున్నాయి.
వివాహానికి ముందు ఏమీ తెలియకుండా..
వివాహాలకు ముందు తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలను సమగ్రంగా తెలుసుకోవడం లేదు. ముహూర్తాల గురించి.. లాంఛనాల గురించి.. పలుమార్లు మాట్లాడుకునే పెద్దలు కొత్త జంట కలిసి ఉండగలరో లేదో ఆలోచించడం లేదు. కొందరు డబ్బు చుట్టూ తిరుగుతున్నారు. మనీ ఉంటే అన్నీ సమసిపోతాయనే భ్రమలో ఉంటున్నారు. తీరా పెళ్లి అయ్యాక వారి మధ్య అనుబంధం పెరగకపోగా అనుమానాలు పొడచూస్తున్నాయి. ఆపై ఇరు కుటుంబాల్లో కల్లోలం రేపుతున్నాయి.
సమగ్ర అవగాహన లేక
డాక్టర్ సూర్యనారాయణ, మానసిక వైద్య నిపుణులు, విజయనగరం
ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, ఎవరికి వారు వ్యక్తిగత జీవితాన్ని కోరుకోవటం కూడా వివాహేతర సంబంధాలకు కారణమవుతున్నాయి. అలస్యంగా పెళ్లిచేసుకోవడం, దాంపత్య జీవితంపై అవగాహన లేకపోవడంతో వారి జీవితాల్లో వారే నిప్పులు పోసుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంటోంది. ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా ఆ విషయాన్ని దాచకుండా ఉంటే సమస్య పెరగదు. అలాగే పెద్దలతో అనుబంధంగా ఉండాలి. కానీ వారికి దూరంగా ఉంటున్నారు. సమస్యలు పెరగడానికి ఇది కూడా కారణం.
-------------