Share News

నలుగురు సచివాలయ కార్యదర్శుల సస్పెన్షన్‌

ABN , Publish Date - Nov 23 , 2025 | 10:58 PM

మండల కేంద్రం కొమరాడ పంచాయతీలో నిధులు దుర్వినియోగానికి పాల్పడిన నలుగురు సచివాలయ కార్యదర్శులను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.

నలుగురు సచివాలయ కార్యదర్శుల సస్పెన్షన్‌
ఈ ఏడాది ఆగస్టు 13న ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం

- నిధుల దుర్వినియోగంపై అధికారుల చర్యలు

పార్వతీపురం/కొమరాడ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం కొమరాడ పంచాయతీలో నిధులు దుర్వినియోగానికి పాల్పడిన నలుగురు సచివాలయ కార్యదర్శులను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కొమరాడ పంచాయతీకి గత నాలుగేళ్లలో ప్రభుత్వం నుంచి రూ.95లక్షలు మంజూరయ్యాయి. ఇందులో అత్యధిక నిధులు పక్కదారి పట్టినట్లు పీజీఆర్‌ఎస్‌కు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో కలెక్టర్‌ స్పందించి విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్‌కు అందించారు. ఈ మేరకు నలుగురు సచివాలయ కార్యదర్శులను సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌కు గురైన వారిలో గతంలో కొమరాడ పంచాయతీలో పనిచేస్తూ సీతానగరం మండలం అంటిపేట సచివాలయానికి బదిలీపై వెళ్లి పస్తుతం డెప్యుటేషన్‌పై పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామ సచివాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న గణపతి, గరుగుబిల్లి మండలం కుంకిడివరం సచివాలయం కార్యదర్శి వైకుంఠరావు, సీతానగరం మండలం జోగిపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగం అయినట్టు ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న శ్రీనివాసరావు, కొమరాడ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న నాగరాజు ఉన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పంచాయతీ సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీనిపై డీపీవో కొండలరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. డీఎల్‌పీవో నాగభూషణరావు వద్ద ప్రస్తావించగా.. ‘గణపతి, వైకుంఠరావు, నాగరాజు, శ్రీనివాసరావు సస్పెండ్‌ అయిన మాట వాస్తవమే.’ అని అన్నారు. పార్వతీపురం ఎంపీడీవో వద్ద ప్రస్తావించగా గణపతి సస్పెండ్‌ అయినట్టు కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయని తెలిపారు.

Updated Date - Nov 23 , 2025 | 10:58 PM