తీరంలో నిఘా
ABN , Publish Date - May 08 , 2025 | 12:09 AM
Surveillance on the coast పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసి ముష్కరులను మట్టుబెట్టిన నేపథ్యంలో తీరం వెంబడి పోలీసులు అప్రమత్తమయ్యారు. డేగ కన్నుతో సంద్రాన్ని జల్లెడ పడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌లో ప్రభుత్వం, ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.
తీరంలో నిఘా
ప్రత్యేక కెమెరాలతో పర్యవేక్షిస్తున్న పోలీసులు
భోగాపురం/ పూసపాటిరేగ, మే7(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసి ముష్కరులను మట్టుబెట్టిన నేపథ్యంలో తీరం వెంబడి పోలీసులు అప్రమత్తమయ్యారు. డేగ కన్నుతో సంద్రాన్ని జల్లెడ పడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌లో ప్రభుత్వం, ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం ముప్పేట దాడి చేసి మట్టుబెట్టింది. దీంతో భారత్‌పై ఉక్రోశంగా ఉన్న పాకిస్థాన్ ఏ మార్గంలోనైనా దాడి చేయొచ్చునని, ఏదైనా పన్నాగం పన్నవచ్చునని పోలీసులు అనుమానిస్తూ అప్రమత్తమయ్యారు. సముద్రం గుండా ఉగ్రవాదులు చొరబడితే ఎలా పట్టుకోవాలో అన్న దానిపై పోలీసులు, మెరైన్ నేవీ సిబ్బంది సంయుక్తగా ఇటీవల మాక్‌డ్రిల్ కూడా నిర్వహించారు.
జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో 29 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. సంద్రాన్ని ఆనుకుని 21 గ్రామాలున్నాయి. ఉగ్రవాదులు సముద్ర మార్గాన చొరబడటానికి ప్రయత్నించే ప్రమాదం ఉందన్న అనుమానంతో మెరైన్ సీఐ బీవీజే రాజు ఆధ్వర్యంలో సుమారు 28 మంది మెరైన్ సిబ్బంది తీరంలో పర్యటిస్తూ సముద్రంపై డేగ కన్నుతో ప్రహారా కాస్తున్నారు. అలాగే భోగాపురం సీఐ కె.దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో తీర ప్రాంత గ్రామాల్లో పోలీస్ మొబైల్ వాహనాలు పర్యవేక్షిస్తున్నాయి. తీర గ్రామాల్లోకి ఎవరైనా గుర్తు తెలియని, కొత్త వ్యక్తలు వస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు తెలియజేస్తున్నారు. తీరంలో అప్రమత్తతపై మెరైన్ సీఐ బీవీజే రాజు, భోగాపురం సీఐ కె.దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేకపోయినా ముందస్తుగా పర్యవేక్షిస్తున్నామన్నారు.