Share News

Surveillance on temples! ఆలయాలపై నిఘా!

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:05 AM

Surveillance on temples! జిల్లా వ్యాప్తంగా ఆలయాలపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రార్థనాలయాల రక్షణకు సైతం నడుం బిగించింది. భద్రత కారణాల దృష్ట్యా వాటిపై నిఘా పెట్టింది. జిల్లా వ్యాప్తంగా 3 వేల సీసీ కెమరాలను అమర్చే పనిలో పడింది.

Surveillance on temples! ఆలయాలపై నిఘా!

ఆలయాలపై నిఘా!

జిల్లా వ్యాప్తంగా 3 వేల సీసీ కెమెరాలు

అమర్చే పనిలో పోలీస్‌ యంత్రాంగం

ప్రార్థనాలయాల వద్ద సైతం

- కొన్నేళ్ల కిందట రామతీర్థంలో రాముల వారి విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ నిందితులను పట్టుకోలేకపోయారు. పేరొందిన ఆలయం వద్ద సీసీ కెమరాలు ఏర్పాటుచేయకపోవడం పెద్ద లోపమే.

- ఏడాది కాలంగా ఆలయాల్లో చోరీ ఘటనలు దాదాపు 20 వరకూ జరిగినట్టు పోలీస్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఆలయాల వద్ద సీసీ ఫుటేజీలు లేకపోవడంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.

రాజాం, జూలై 18(ఆంధ్రజ్యోతి):

జిల్లా వ్యాప్తంగా ఆలయాలపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రార్థనాలయాల రక్షణకు సైతం నడుం బిగించింది. భద్రత కారణాల దృష్ట్యా వాటిపై నిఘా పెట్టింది. జిల్లా వ్యాప్తంగా 3 వేల సీసీ కెమరాలను అమర్చే పనిలో పడింది. జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో పురాతన ఆలయాలున్నాయి. రాజాం, బొబ్బిలి, ఎస్‌.కోట, పూసపాటిరేగలో సైతం పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపు 1000 వరకూ దేవదాయ శాఖ గుర్తించిన ఆలయాలున్నాయి. స్థానికులతో నడుస్తున్న ఆలయాల వద్ద కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో ఆలయ కమిటీలు, ట్రస్టులు సహకారం అందిస్తున్నాయి.

చోరీలు అధికం కావడంతోనే..

జిల్లాలో ఇటీవల దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఇప్పటివరకూ ఎవరూ లేని ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగలు రెచ్చిపోయేవారు. ఇప్పుడు ఆలయాలపై పడ్డారు. రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నారు. దేవుడి గుళ్లు అని చూడకుండా గుల్ల చేస్తున్నారు. విగ్రహాలపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దోచుకుపోతున్నారు. హుండీలను పగులగొట్టి నగదుతో పరారవుతున్నారు. జిల్లాలో పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. భక్తులు ఎంతో నమ్మకంతో, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఇటువంటి చోట్ల నేడు భద్రత కరువైంది. గ్రామాలకు దూరంగా, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే ఆలయాలనే టార్గెట్‌ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి తరువాత గేట్లు, తలుపులు, హుండీలు పగులకొడుతున్నారు. కొన్నిచోట్ల హుండీలను ఎత్తుకెళ్లి దూరంగా ఉన్న పొలాలు, తోటల్లో పడేస్తున్నారు. దేవదాయ శాఖ, పోలీస్‌ శాఖలు సంయుక్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి.

నాటి ఘటనతో..

వైసీపీ హయాంలో రామతీర్థం దేవస్థానంలో విగ్రహాల ధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఆలయాల భద్రత ప్రశ్నార్థకమైంది. ముప్పేట విమర్శలు రావడంతో అప్పట్లో పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటు స్థానికుల ఆధీనంలో ఉండే ఆలయాల్లో సైతం ఏర్పాటుచేయాలని పోలీసులు సూచించారు. అయితే అప్పట్లో కొన్నిచోట్ల మాత్రమే ఏర్పాటుచేశారు. మిగతా చోట్ల అమర్చడంలో జాప్యం జరుగుతూ వచ్చింది. జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలో 1000 వరకూ దేవాలయాలున్నాయి. స్థానికుల చేతిలో నడుస్తున్న చాలా దేవాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చలేదు. ముఖ్యంగా ఊరికి దూరంగా ఉండే అమ్మవారి ఆలయాలను, కొండపై ఉండే ఆలయాలను దొంగలు టార్గెట్‌ చేస్తుండడం గమనార్హం. అందుకే జిల్లా వ్యాప్తంగా 3 వేల సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు.

ఫోకస్‌ పెట్టాం..

ఆలయాల్లో చోరీలపై పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయించాం. ఆలయ కమిటీలు, గ్రామపెద్దలతో సమావేశాలు ఏర్పాటుచేశాం. వారికి తగిన సలహాలు, సూచనలు అందించాం. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే 100కు ఫోన్‌ చేయాలని ప్రజలకు సూచించాం. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల బిగింపు ప్రక్రియ జరుగుతోంది.

- కె.అశోక్‌కుమార్‌ సీఐ, రాజాం

----------------------------

Updated Date - Jul 19 , 2025 | 12:05 AM