బాధితులకు అండగా..
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:25 AM
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
- ప్రకృతి వైపరీత్యాల పరిహారాన్ని పెంచిన ప్రభుత్వం
- ముంథా బాధిత కుటుంబాలకు కలగనున్న లబ్ధి
శృంగవరపుకోట అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. బాధిత కుటుంబాలకు చెల్లించే నష్ట పరిహారాన్ని మరింత పెంచింది. రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధులు (ఎస్‌డీఆర్‌ఎఫ్)కు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నిధులను జోడించి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొంఽథా తుఫాన్‌తో నష్టపోయిన కుటుంబాలకు లబ్ధిచేకూరనుంది. జిల్లాలో ప్రతి సంవత్సరం సంభవించే తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఆనకట్టలు, నదులు, గెడలు, చెరువులు ఉప్పొంగి వేలాది ఎకరాల్లో పంటలు, పండ్ల తోటలు దెబ్బతింటున్నాయి. పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు వంటి మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలి కొందరి జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇలాంటి కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుల నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తుల నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) నుంచి పరిహారం చెల్లిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో విపత్తుల నిధి తక్కువగా ఉంది. దీంతో 2024లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నిధులను జోడించి బాధితులకు మెరుగైన సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యోచించారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిఽధికి మించి పరిహారం ఇవ్వాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 21మండలాల్లో 2,757.6 హెక్టార్లలో వరి, 12 హెక్టార్లలో పండ్ల తోటలకు నష్టం జరిగినట్ల ప్రాథమికంగా ఆయా శాఖల అధికారులు నివేదికలు తయారు చేశారు. హెక్టారుకు రాష్ట్ర విపత్తుల నిధి రూ.17వేలు మాత్రమే ఉంది. దీనికి మించి కూటమి ప్రభుత్వం హెక్టారుకు రూ.25వేలు చెల్లించనుంది. దెబ్బతిన్న ఇళ్లకు గతంలో రూ.5వేలు ఇచ్చేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని రూ.10వేలు చేసింది.
పరిహారం పెంపు ఇలా..
మనుషులు చనిపోతే గతంలో రూ.4లక్షల చెల్లించేవారు. ఇప్పుడు రూ.5లక్షలు ఇవ్వనున్నారు. ఆవులు, గేదెలు వంటి పశువుల మృతి చెందితే గతంలో రూ.37,500 చెల్లించగా, ఇప్పుడు రూ.50వేలు అందిస్తారు. వరి, పత్తి, వేరు శనగ, చెరకు, బొప్పాయి పంటలకు సంబంధించి హెక్టారుకు రూ.17 వేల నుంచి రూ.25వేలుకు సాయం పెంచారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి రూ.5వేల నుంచి రూ.10వేలుకు పరిహారాన్ని పెంపుదల చేశారు.