Share News

నిరుపేదలకు అండగా..

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:08 AM

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదల పాలిట వరంగా మారింది. వారికి ఆర్థికంగా అండగా నిలుస్తోంది.

 నిరుపేదలకు అండగా..

- ఆర్థికంగా ఆదుకుంటున్న సీఎంఆర్‌ఎఫ్‌

- జిల్లాలో ఎంతోమందికి లబ్ధి

- శృంగవరపుకోట మండలం తిమిడి గ్రామానికి చెందిన బేతా వెంకటరమణ, మంగమ్మ కుమారుడు వెంకట శివప్రసాద్‌ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో శివప్రసాద్‌ను చేర్పించగా కిడ్నీ, లివర్‌ పాడవుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు రూ.2.42లక్షలు ఖర్చయింది. పేద కుటుంబ కావడంతో అప్పు చేసి ఆ డబ్బు తెచ్చారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ జీఎస్‌ నాయుడు సహకారంతో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని ఆ కుటుంబం కలిసింది. సీఎం సహాయ నిధి ద్వారా ఆ కుటుంబానికి రూ.99,261 అందించి ఆదుకున్నారు.

- వేపాడ మండలం అరిగిపాలెం గ్రామానికి చెందిన రాము అనే మహిళ కూలీనాలి చేసుకుని బతుకుతుంది. భర్త చాలా కాలం కిందట చనిపోయాడు. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. శస్త్ర చికిత్స అవసరం కావడంతో అప్పు చేసి రూ.3.79లక్షలు ఆస్పత్రికి చెల్లించారు. గ్రామ నాయకుడు దుల్ల వెంకటరావుతో కలిపి ఎమ్మెల్యే లలిత కుమారిని ఆ కుటుంబం కలిసింది. సీఎం సహాయ నిధి ద్వారా వారికి రూ.1.31 లక్షలు ఇప్పించారు. ఈ డబ్బుతో సగం అప్పు తిరిగి చెల్లించారు.

శృంగవరపుకోట, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదల పాలిట వరంగా మారింది. వారికి ఆర్థికంగా అండగా నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 600 నుంచి 800 పేద కుటుంబాలు కోట్ల రూపాయలు లబ్ధిపొందినట్లు అంచనా. ఒక్క శృంగవరపుకోట నియోజకవర్గంలోనే 159 పేద కుటుంబాలు రూ.1.50 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ను అందుకున్నాయి. ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ రూ.కోటి నుంచి రూ.2కోట్ల వరకు శాసన సభ్యులు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రాబట్టారు. ప్రస్తుతం వైద్యం ఖరీదైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద పెద్ద జబ్బులు నయమవుతాయన్న నమ్మకం ప్రజల్లో లేదు. అనార్యోగ్యం నుంచి బయటపడాలంటే ప్రైవేటు, కార్పొరేట్‌ వైద్యం పొందక తప్పదన్న నిర్నయానికి వచ్చేశారు. దీంతో పేద, ధనిక అనే తేడా లేకుండా కొన్ని వ్యాధులను నయం చేసుకునేందుకు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కొన్ని వ్యాధులకు అందులో చోటు లేదు. ఒక వేళ ఉన్నప్పటికీ దీని ద్వారా వచ్చే సొమ్ము సరిపోవడం లేదు. అదనంగా రూ.లక్షల్లో ఖర్చవుతుంది. దీంతో అప్పు చేయాల్సి వస్తుంది. ఇంత అప్పు చేసి వైద్యం చేయించినప్పటికీ ప్రాణాలు దక్కని వారున్నారు. కుటుంబ పెద్ద కనుమరుగు అవడంతో పని చేసేవారు లేక, అప్పు ఎలా తీర్చాలో అర్ధం కాక అనేక పేద కుటుంబాలు సతమతమవుతున్నాయి. అలాగే, ఆరోగ్యం బాగుపడిన వారిలో కొందరు కొన్నాళ్లు మంచానికే పరిమితవుతున్నారు. వారికి అవసరమయ్యే మందులు, ఆహారానికి డబ్బులు లేక అవస్థలు పడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆసరాగా ఉంటుంది. వారి వైద్యానికయ్యే ఖర్చులో సగం, ఒక్కోసారి సగానికి పైబడి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా వచ్చేస్తుంది. ఇది పేద కుటుంబాలు ఎంతో కొంత తేరుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి..

- దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్న కుటుంబాలు సీఎం సహాయ నిధికి అర్హులు. తెల్లరేషన్‌ కార్డు తప్పని సరి.

- చికిత్స పొందిన ఆసుపత్రి వివరాలు, ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రం సమర్పించాలి.

- రోగికు అందుతున్న చికిత్స, కొనసాగింపునకు అయ్యే ఖర్చు వివరాలు ఆసుపత్రి నుంచి తీసుకోవాలి

-వైద్య ఖర్చు వివరాలు, డిశ్చార్జి ధ్రువపత్రం, బిల్లులు తీసుకోవాలి.

- వీటిని ఆధార్‌, బ్యాంకు ఖాతాల సంఖ్యతో ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలి.

- దరఖాస్తులో ఉన్న వివరాలను అధికారులు పరిశీలిస్తారు.

- ఎంత సహాయం చేయాలో అక్కడే నిర్ణయం జరుగుతుంది.

Updated Date - Sep 20 , 2025 | 12:08 AM