Share News

Supporting the heart..! గుండెకు అండగా..!

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:38 PM

Supporting the heart..! నెల్లిమర్లకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు టెనెక్ట్‌ప్లస్‌ ఇంజెక్షన్‌ ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది. తరువాత విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయించుకున్నాడు. రెండు స్టంట్లు వేయడంతో ప్రాణాలు నిలుపుకుని ఇంటికి క్షేమంగా చేరాడు. కాగా ఈ ఇంజెక్షన్‌ ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. ఇది పేద ప్రజలకు కొండంత ‘గుండె’భరోసా.

Supporting the heart..! గుండెకు అండగా..!

గుండెకు అండగా..!

ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.40 వేల విలువైన ఇంజెక్షన్‌

గుండెపోటు బాధితులకు అందివ్వనున్న ‘టెనెక్ట్‌ప్లేస్‌’

తొలి గంటలో వేస్తే తప్పనున్న ప్రమాదం

జిల్లా వ్యాప్తంగా అందుబాటులో 132 ఇంజెక్షన్లు

నెల్లిమర్లకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు టెనెక్ట్‌ప్లస్‌ ఇంజెక్షన్‌ ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది. తరువాత విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయించుకున్నాడు. రెండు స్టంట్లు వేయడంతో ప్రాణాలు నిలుపుకుని ఇంటికి క్షేమంగా చేరాడు. కాగా ఈ ఇంజెక్షన్‌ ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. ఇది పేద ప్రజలకు కొండంత ‘గుండె’భరోసా.

నెల్లిమర్ల, నవంబరు 24(ఆంధ్రజ్యోతి):

అత్యవసర సమయాల్లో టెనెక్ట్‌ప్లేస్‌ ఇంజెక్షన్లు గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుల ప్రాణాలు నిలుపుతున్నాయి. ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోని పేరుమోసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. తెలిసిన వారు, అందుబాటులో ఉన్నవారే ఈ ఇంజెక్షన్లను వాడేవారు. సాధారణంగా గుండెపోటుకు గురైన వ్యక్తికి సంబంధించి రక్తం సరఫరా చేసే నాళాలు ముడుచుకుని పోతుంటాయి. దానిని నియంత్రించేందుకు ఈ ఇంజెక్షన్లు ఎంతగానో దోహదపడతాయి. గుండెపోటుకు గురైన రెండు గంటల వ్యవధిలో వీటిని అందించాల్సి ఉంటుంది. అలా ఇంజెక్షన్లు అందక చాలామంది మృత్యువాత పడుతుండేవారు. కూటమి ప్రభుత్వం అన్ని సామాజిక ఆస్పత్రుల్లో ఈ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచింది. రోగులకు ఉచితంగా అందించేందుకు నిర్ణయించింది. ఇది నిరుపేదలకు వరంలాంటిది.

జిల్లాకు 134 ఇంజక్షన్లు..

జిల్లాలో గుండె వ్యాధి నిపుణులతో ఒక గ్రూపు ఏర్పాటుచేశారు. రోగి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వెంటనే ఈసీజీ తీస్తారు. ఈ నివేదికను గ్రూపులో పోస్టు చేస్తారు. వైద్యుల సూచన మేరకు రూ.40 వేలు విలువచేసే ఇంజెక్షన్‌ ఇస్తారు. అన్ని ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచారు. జిల్లాకు 132 ఇంజక్షన్లు ఇవ్వగా.. అందులో 100 వరకూ వినియోగించినట్టు తెలుస్తోంది. విజయనగరం జీజీహెచ్‌లో 10 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. రాజాం ప్రాంతీయ ఆస్పత్రిలో 24, చీపురుపల్లిలో 10, గజపతినగరంలో 13, ఎస్‌.కోటలో 3, బాడంగి సీహెచ్‌సీలో 9, బొబ్బిలిలో 56, భోగాపురంలో 2, నెల్లిమర్లలో 5 ఇంజక్షన్లు అందుబాటులో ఉంచారు. వాటిలో కొన్ని వినియోగించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి ఈ ఇంజెక్షన్లు పంపిస్తారు.

ఫ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని చాలామందికి తెలియదు. అందుకే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు చెల్లించుకుంటున్నారు. సాధారణంగా ఛాతిలో మంట, నీరసం, ఎడమ వైపు భుజం పీకడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆయాసం వంటివి గుండెపోటు లక్షణాలు. వీటిని గుర్తించిన వెంటనే బాధితుడు సమీప ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలి. అక్కడి వైద్యులు పరీక్షించి గుండెపోటుగా నిర్ధారిస్తే వెంటనే రూ.40 వేల విలువ చేస్తే ఇంజక్షన్‌ను అందిస్తారు. ఫలితంగా గుండెలో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.

ప్రభుత్వాస్పత్రికి తీసుకురావాలి

గుండెపోటు లక్షణాలు కనిపించిన గంటలోపు చాలా కీలకం. వెంటనే ప్రభుత్వాస్పత్రులకు తీసుకెళ్తే ఈసీజీ తీస్తారు. గుండెపోటు అని తేలితే వెంటనే ఇంజక్షన్‌ చేస్తారు. అటు తరువాత ఆస్పత్రులకు తరలించి ఆపరేషన్లు చేస్తారు. అవగాహన లేక చాలామంది వినియోగించుకోవడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఇంజక్షన్లు అందుబాటులోకి వచ్చాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

- తిరుమలాదేవి, సీహెచ్‌ఎన్‌సీ సూపరింటెండెంట్‌, నెల్లిమర్ల

Updated Date - Nov 24 , 2025 | 11:38 PM