Share News

Auto Drivers ఆటో డ్రైవర్లకు అండగా ..

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:58 PM

Support for Auto Drivers ఆటో డ్రైవర్లకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టారని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సూపర్‌ సిక్స్‌ పథకాలను సూపర్‌గా అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

 Auto Drivers ఆటో డ్రైవర్లకు అండగా ..
పార్వతీపురంలో ఆటో నడిపిన తర్వాత విక్టరీ సంకేతం చూపిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే విజయచంద్ర

  • వారి సంక్షేమమే లక్ష్యం

  • సూపర్‌ సిక్స్‌ సూపర్‌గా అమలు

  • మంత్రి అచ్చెన్నాయుడు

పార్వతీపురం, అక్టోబరు4(ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్లకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టారని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సూపర్‌ సిక్స్‌ పథకాలను సూపర్‌గా అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. శనివారం జిల్లా కేంద్రం పార్వతీపురంలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముందుగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ నుంచి సుమారు మూడు కిలోమీటర్లు ఆటో నడిపి సందడి చేశారు. ఎమ్మెల్యే విజయచంద్ర, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డితో కలిసి ఆటోలో నేరుగా సభా స్థలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఆటోడ్రైవర్లు తమ ప్రచారకర్తలన్నారు. వారి సంక్షేమం కోసమే సీఎం చంద్రబాబు ఏడాదికి రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారని వెల్లడించారు. మన్యం జిల్లాలో 5,217 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.7.82 కోట్లను జమ చేసినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ వైశాలి చేతుల మీదుగా ఆయన ఆటో డ్రైవర్లకు చెక్కు అందించారు. ఈ సందర్భంగా కొంతమంది ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రూ.10 వేలు ఇచ్చారని, రోడ్లు బాగోలేనందున తమ వాహనాల మరమ్మతులకే ఆ మొత్తం సరిపోయేదని వెల్లడించారు.

త్వరలో ఆటో డ్రైవర్లకు ఇళ్లు : మంత్రి సంధ్యారాణి

సాలూరు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): పక్కా గృహాలు లేని ఆటో డ్రైవర్లకు అతి త్వరలోనే ఇళ్లు మంజూరు చేయనున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు పట్టణంలో శనివారం ‘ ఆటో డ్రైవర్ల సేవలో ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆటో నడిపి అందరినీ ఉత్సాహపరించారు. అనంతరం జెండా ఊపి ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ర్యాలీని ప్రారంభించారు. థాంక్యూ సీఎం సార్‌ అంటూ ఆటో డ్రైవర్లు తమ వాహనాలతో మెయిన్‌ రోడ్డు మీదుగా బోసుబొమ్మ, డీలక్స్‌ సెంటర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు ర్యాలీ కొనసాగించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ఎవరికైనా ఖాతాల్లో డబ్బులు జమకాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమస్యలేమైనా ఉంటే తమకు తెలియజేయాలని సూచించారు. సాలూరు నియోజకవర్గంలో 1400 మంది ఖాతాలో కోటీ 90 లక్షలు జమ చేసినట్లు వెల్లడించారు. అనంతరంలో ఆటో డ్రైవర్లకు చెక్కు అందజేశారు. ఒంటరి ఆడపిల్లలు, విద్యార్థినులు, గర్భిణులను సురక్షితంగా ఇళ్లు, ఆసుపత్రులకు చేర్చాలని కోరారు. అరకు కాఫీ ఉత్పత్తులకు సంబంధించి జీసీసీకి జాతీయ స్థాయి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందని, ఇది సీఎం చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమైందని తెలిపారు.

Updated Date - Oct 04 , 2025 | 11:58 PM