Share News

Gurukuls గురుకులాల్లో పర్యవేక్షణ

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:44 PM

Supervision in Gurukuls గురుకుల విద్యా సంస్థల్లో ఐటీడీఏ పీవో లేదా డీడీ స్థాయి అఽధికారితో పర్యవేక్షణ తప్పనిసరి చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ తెలిపారు. ప్రతి గురువారం ఆశ్రమ పాఠశాలలో ఏఎన్‌ఎం, నెలకొకసారి డాక్టర్లు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

 Gurukuls గురుకులాల్లో పర్యవేక్షణ
పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శిస్తున్న గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నాయక్‌

  • జిల్లాకేంద్రాసుపత్రి, కురుపాం గురుకులం సందర్శన

  • బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఆరా

  • పరిస్థితి అదుపులో ఉందని వెల్లడి

పార్వతీపురం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): గురుకుల విద్యా సంస్థల్లో ఐటీడీఏ పీవో లేదా డీడీ స్థాయి అఽధికారితో పర్యవేక్షణ తప్పనిసరి చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ తెలిపారు. ప్రతి గురువారం ఆశ్రమ పాఠశాలలో ఏఎన్‌ఎం, నెలకొకసారి డాక్టర్లు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం పార్వతీపురం వచ్చిన ఆయన స్థానిక పోలీస్‌ క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘ కురుపాం గురుకులానికి చెందిన బాలికలు పచ్చకామెర్లతో బాధపడుతుండడం ఎంతో బాధగా ఉంది. ప్రస్తుతం విద్యార్థినులు విశాఖపట్నం కేజీహెచ్‌తో పాటు పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా క్షేమంగా ఉన్నారు. పరిస్థితి అదుపులో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచన మేరకు పార్వతీపురం వచ్చా. గురుకుల విద్యాలయాలతో పాటు ఆశ్రమ పాఠశాలల్లో ఆర్‌వో ప్లాంట్స్‌, మరుగుదొడ్లు , అదనపు తరగతి గదులు నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే మరుగుదొడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. పాఠశాల స్థాయిను బట్టి విద్యార్థుల సంఖ్య ఉండే విధంగా చూస్తాం. ప్రస్తుతం పాఠశాలల్లో స్థాయిని మించి విద్యార్థులు ఉంటే అదనపు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం. కురుపాం విద్యార్థినులు జాండీస్‌తో ఎందుకు బాధపడు తున్నారో నివేదికలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కలుషిత ఆహారమా?లేక మరే ఇతర కారణమన్నది అనేది తేలాల్సి ఉంది. ’ అని తెలిపారు. అనంతరం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందు తున్న కురుపాం గురుకుల బాలికలను నాయక్‌ పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని వైద్యులకు సూచించారు. త్వరగా కోలుకునేలా చూడాలన్నారు. ఇదిలా ఉండగా గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలువురు గిరిజన సంక్షేమ సంఘం నాయకులు ఆయన్ని కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ పరిశీలనలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణరావు, సూపరిం టెండెంట్‌ నాగశివజ్యోతి , జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్పిల్‌ జగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలను వెంటనే తెలియజేయండి

కురుపాం,అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సమస్యలేమైనా ఉంటే వెంటనే కలెక్టర్‌, ఐటీడీఏ పీవోకు తెలియజేయాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ ఆదేశించారు. మంగళవారం గురుకులాన్ని ఆయన సందర్శిం చారు. పాఠశాల స్టోర్‌ రూమ్‌, కిచెన్‌ షెడ్‌, మరుగుదొడ్లు పరిశీలించి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మిని అడిగి విషయం తెలుసుకున్నారు. పారిశుధ్యం సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలో సరిపడా విద్యార్థినులను మాత్రమే జాయిన్‌ చేసుకోవాలన్నారు. ఇకపై ఎక్కవ మందికి జాయిన్‌ చేయరాదని సూచించారు. ఈ విషయంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, జిల్లా యంత్రాంగం సకాలంలో స్పందించాలని తెలిపారు. పాఠశాలలో నిలిచిన భవన నిర్మాణంపై ఈఈ మణిరాజును ప్రశ్నించారు. నిధులు లేకపోవడతో పనులు నిలిచిపోయాయని ఆయన తెలిపారు. కాగా భవన నిర్మాణం పూర్తికి ప్రతి ప్రతిపాదనలు పంపించాలని నాయక్‌ సూచించారు. పాఠశాలలో మరుగుదొడ్లు మరమ్మతులు, కిటికీలు, తలుపుల పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరంగురుకులం పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు జరుపుతున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, డాక్టర్‌ తనూజతో మాట్లాడి పరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆ తర్వాత ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేశారు.

Updated Date - Oct 07 , 2025 | 11:48 PM