sunsesnal in nellimaral నెల్లిమర్లలో కలకలం
ABN , Publish Date - May 28 , 2025 | 11:58 PM
నెల్లిమర్ల నగర పంచాయతీలో అక్రమ నీటి కుళాయి కనెక్షన్ల గుట్టు రట్టయింది. గృహ సంబంధ నీటి కుళాయి కనెక్షన్లపై వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ తారక్‌నాథ్ సీరియస్‌గా తీసుకున్నారు. విచారణకు ఆదేశించడంతో పెద్ద దందాయే వెలుగు చూసింది. ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు, 11 మంది సిబ్బందిని బృందాలుగా నియమించి విచారణ చేయించారు.
నెల్లిమర్లలో కలకలం
అక్రమ నీటి కనెక్షన్ల గుట్టు రట్టు
కొత్త కమిషనర్ విచారణతో వెలుగులోకి
ఇప్పటికే 267 కనెక్షన్ల గుర్తింపు
సుమారు రూ.21 లక్షల ఆదాయానికి గండి
నెల్లిమర్ల, మే 28(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీలో అక్రమ నీటి కుళాయి కనెక్షన్ల గుట్టు రట్టయింది. గృహ సంబంధ నీటి కుళాయి కనెక్షన్లపై వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ తారక్‌నాథ్ సీరియస్‌గా తీసుకున్నారు. విచారణకు ఆదేశించడంతో పెద్ద దందాయే వెలుగు చూసింది. ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు, 11 మంది సిబ్బందిని బృందాలుగా నియమించి విచారణ చేయించారు. ఇప్పటివరకు 267 నీటి కుళాయి కనెక్షన్‌లు అక్రమమని తేల్చారు. ఇంకా విచారణ సాగుతోంది. నగర పంచాయతీ నెల్లిమర్ల, జరజాపుపేటల్లో సుమారు 400 వరకు ఈ తరహా అక్రమ కనెక్షన్‌లు ఉండవచ్చని భావిస్తున్నారు.
నెల్లిమర్ల్ల నగర పంచాయతీలో అందరికీ తాగునీరు అందేలా గతంలో ప్రతి వీధిలోనూ పబ్లిక్ కుళాయిలు ఏర్పాటు చేశారు. నీటి వనరులను బట్టి ఆ కుళాయిల ద్వారా ఉదయం గాని, సాయంత్రం గాని ఏదో ఒక పూట గంట నుంచి రెండు గంటల వరకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. కాగా అదనంగా డిపాజిట్ చెల్లించిన వారి ఇళ్లకు తాగునీటి కనెక్షన్‌లు ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. ఈ విధంగా డిపాజిట్ చెల్లించి చాలా మంది తమ తమ ఇళ్లకు నీటి కుళాయిలు వేయించుకున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయితీ కౌన్సిల్ తీర్మానం ప్రకారం ఇంటి కనెక్షన్ కోరుకున్న యజమాని డిపాజిట్‌గా 10 వేల రూపాయలు, కుళాయి ఎస్టిమేషన్ చార్జీగా మరో వెయ్యి రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. దీన్ని బట్టి రూ. 11 వేలను చలానా రూపంలో నగర పంచాయతీ అధికారులకు చెల్లించి కనెక్షన్‌లు వేసుకోవాలి.
నిబంధన ఒకలా.. జరిగిందొకలా!
కొద్ది రోజుల క్రితం నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్‌గా బదలీపై వచ్చిన తారక్‌నాథ్‌ఇళ్లకు ఇచ్చిన తాగునీటి కనెక్షన్‌లపై దృష్టి సారించారు. దీంతో అసలు రంగు బయటపడింది. డిపాజిట్ సొమ్ము చెల్లించకుండానే కుళాయిలు కలిగి ఉన్నట్లు తేటతెల్లం అయింది. నగర పంచాయతీ పరిధిలోని అన్ని వార్డు సచివాలయాల సిబ్బందిని రంగంలోకి దించారు. నీటి కుళాయిలు కలిగి ఉన్న యజమానుల జాబితాలను సిద్ధం చేశారు. డిపాజిట్ కట్టిన వారి వివరాలను కూడా రికార్డుల ఆధారంగా తెలుసుకున్నారు. విచారణలో ఎలాంటి డిపాజిట్ చెల్లించకుండా సుమారు 267 మంది నీటి కుళాయిలు కలిగి ఉన్నారని తెలుసుకుని విస్తుపోయారు. ఈ సంఖ్య 400 వరకు చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయా కుళాయిలకు డమ్మీలు వేసి బంద్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆ ఇళ్ల యజమానులను కార్యాలయానికి పిలిపించి జూన్ ఒకటి నుంచి వారి నుంచి డిపాజిట్ కట్టించుకోవాలా ? లేదంటే శాశ్వతంగా మూసి వేయాలా అన్న విషయంపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు ఆలోచిస్తున్నారు. గతంలో ఇంటి యజమానులు ఎవరికైనా సొమ్మును నగదు రూపంలో ఇచ్చి ఉంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న కోణంలో కూడా ఆలోచన చేస్తున్నట్లు భోగట్టా. ఇప్పటివరకు గుర్తించిన అక్రమ కనెక్షన్‌ల ద్వారా ఐదేళ్ల క్రితమే నగర పంచాయతీ సుమారు రూ.21 లక్షల ఆదాయం కోల్పోయినట్లు స్పష్టమవుతోంది.
డిపాజిట్ చెల్లించకుండానే పొందడం చట్ట విరుద్ధం
ఎ.తారక్‌నాథ్, కమిషనర్
పబ్లిక్ కుళాయిల ద్వారా తాగునీటి సదుపాయాన్ని ఎవరైనా పొందవచ్చు. అయితే సొంత ఇంటి కుళాయిలు కావాల్సిన వారు రూ.11 వేలను నగర పంచాయతీకి చెల్లించాల్సి ఉంటుంది.చెల్లించకుండానే కొంతమంది కుళాయి కనెక్షన్ పొందారు. వీటిపై విచారణ చేపట్టాం. సిబ్బంది ప్రమేయం ఉంటే చర్యలు తప్పవు.