Sunny Frost ‘మంచు’టెండ
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:41 PM
Sunny Frost జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. మార్చి మొదటివారం నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం ఏడు గంటల వరకు చాలాచోట్ల పొగమంచు కురుస్తుండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది.

ఉదయం పొగ మంచు.. మధ్యాహ్నం ఠారెత్తిస్తున్న ఎండ
కొన్నిచోట్ల వడగాడ్పుల ప్రభావం
వేసవి ప్రారంభంలోనే ప్రజలు ఉక్కిరిబిక్కిరి
పాలకొండ/గరుగుబిల్లి/సీతంపేట రూరల్/సాలూరు రూరల్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. మార్చి మొదటివారం నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం ఏడు గంటల వరకు చాలాచోట్ల పొగమంచు కురుస్తుండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. ఎనిమిది గంట తర్వాత నుంచి భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక చాలామంది ఉదయం 11 గంటల తర్వాత ఇళ్లు కదలడం లేదు. దీంతో జిల్లాలో ప్రధాన రహదారులు, కూడళ్లు, మార్కెట్లు సాయంత్రం నాలుగు గంటల వరకు బోసిపోతున్నాయి. ఏదేమైనా ఎండల తీవ్రతపై వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉండే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితేమిటోనని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని వివిధ మండలాల్లో వడగాడ్పుల ప్రభావం కనిపిస్తోంది. 38 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని మరోవైపు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో మరింత కలవర పడుతున్నారు. సాలూరు ఏజెన్సీలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కురిసింది. ఆ తర్వాత ఎండ ధాటికి జనం ఇబ్బంది పడ్డారు. మొత్తంగా 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. సీతంపేట, గరుగుబిల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా వాతావరణ విచిత్ర పరిస్థితులతో అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గుతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండ వేడి మరింత పెరగనునున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.