Sugar boards in classrooms తరగతి గదుల్లో సుగర్ బోర్డులు
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:49 PM
Sugar boards in classrooms రోజురోజుకు పెరుగుతున్న చక్కెర వ్యాధి(మధుమేహం)కేసులపై ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థులకు చిన్నప్పుడే అవగాహన కలిగిస్తే రేపటి పౌరులు మరింత ఆరోగ్యంగా ఉంటారని భావించి వినూత్న ప్రయోగానికి సంకల్పించింది. తరగతి గదిలో చక్కెర బోర్డులను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నమూనా బోర్డులను కూడా పంపింది.
తరగతి గదుల్లో సుగర్ బోర్డులు
చక్కెర వ్యాధిపై విద్యార్థులకు అవగాహనే లక్ష్యం
ప్రభుత్వ వినూత్న ఆలోచన
కొత్తవలస, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): రోజురోజుకు పెరుగుతున్న చక్కెర వ్యాధి(మధుమేహం)కేసులపై ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థులకు చిన్నప్పుడే అవగాహన కలిగిస్తే రేపటి పౌరులు మరింత ఆరోగ్యంగా ఉంటారని భావించి వినూత్న ప్రయోగానికి సంకల్పించింది. తరగతి గదిలో చక్కెర బోర్డులను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నమూనా బోర్డులను కూడా పంపింది.
ప్రస్తుతం సుగర్ వ్యాధి బాధితులు ఇంటికొకరు చొప్పున ఉంటున్నారు. భవిష్యత్తులో ఈ వ్యాధి మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చిన్న వయసు వారికి కూడా చక్కెర వ్యాధి వస్తోంది. గతంలో 40 సంవత్సరాల వయసు పైబడిన వారిలో మాత్రమే చక్కెర వ్యాధి లక్షణాలు కనిపించేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దీంతో ప్రభుత్వం చక్కెర వ్యాధి నియంత్రణే లక్ష్యంగా పెట్టుకుని విద్యార్థి దశ నుంచే సమగ్ర అవగాహన కల్పించేందుకు నిర్ణయించింది. ప్రత్యేకంగా బోర్డులు తయారు చేయించింది. వాటిని తరగతి గదిలో ప్రదర్శనకు ఏర్పాటు చేయనుంది.
కాగా నేటి తరం ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. విద్యార్థులు ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడడం వల్ల వివిధ రకాల రోగాల బారినపడ్డమే కాకుండా చక్కెర వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పంచదార(చక్కెర) వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు తెలియచేయాలని విద్యాశాఖ సూచించింది. చక్కెర వ్యాధి నియంత్రణ కోసం చక్కెర వినియోగంపై పరిమితులు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకునే విధంగా విద్యార్థులను తయారుచేయాలని నిర్దేశించింది. చక్కెర బోర్డులను పాఠశాల తరగతి గదులతో పాటు పాఠశాల ప్రాంగణాల్లోనూ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రోజుకు పెద్దలు 25 గ్రాములకు మించిన చక్కెర ఉన్న పదార్థాలు తీసుకోకూడదని, పిల్లలు 20 గ్రాములు మించి చక్కెర ఉన్న పదార్థాలను తీసుకోకూడదని సూచించింది. తక్కువ చక్కెర తీసుకోండి.. జీవితాన్ని ఎక్కువ పెంచుకోండి నినాదాన్ని కూడా ఆంగ్లలో ప్రచురించింది. బోర్డుల నమూనాలను ఇప్పటికే పాఠశాలలకు పంపించారు.