Share News

విద్యార్థులూ.. ప్రధానమంత్రితో మాట్లాడుతారా!

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:23 AM

పబ్లిక్‌ పరీక్షలకు ముందు విద్యార్థుల్లో ఉండే భయం, ఒత్తిడి, ఆందోళనను తొలగించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రతిఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.

విద్యార్థులూ.. ప్రధానమంత్రితో మాట్లాడుతారా!

- జనవరి 26న పరీక్షా పే చర్చ కార్యక్రమం

- ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం

-11వ తేదీ వరకు గడువు

రాజాం రూరల్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పబ్లిక్‌ పరీక్షలకు ముందు విద్యార్థుల్లో ఉండే భయం, ఒత్తిడి, ఆందోళనను తొలగించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రతిఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆహ్లాదభరిత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ప్రేరణ నింపుతున్నారు. తమ సందేహాలు, అనుభవాలు, ప్రశ్నలు, పరీక్షలకు సన్నద్ధతతో పాటు వివిధ అంశాలపై నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. వచ్చే ఏదాది జనవరిలో పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించింది.

-ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆరు నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అర్హులుగా నిర్ణయించారు. ప్రధానిని అడిగే ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాలకు మించకూడదని నిబంధన విధించారు.

- పరీక్షా పే చర్చ వెబ్‌సైట్‌పై క్లిక్‌ చేస్తే విద్యార్థి, టీచర్‌, తల్లిదండ్రులు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మొబైల్‌ లేదా మెయిల్‌లో లాగిన్‌ అయి వివరాలు నమోదు చేయాలి.

- వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేశాక స్ర్కీన్‌పై కనిపించే చిన్న చిన్న మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ప్రతిభ ఆధారంగా కేంద్రప్రభుత్వ ఆధీనంలోని నిర్వాహకులు ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తారు. కార్యక్రమంలో పాల్గొనే అందరికీ ప్రశంసాపత్రాలు అందజేస్తారు. విజేతలకు నేరుగా ప్రధానితో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తారు. వారికి ఎగ్జామ్‌ వారియర్‌ కిట్లను ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అందజేస్తారు.

- ప్రతిభ ఆధారంగా ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశాన్ని అందిపుచ్చుకునే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా గాని చదువుతున్న పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయ సిబ్బంది సహకారంతోగాని దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వచ్చేఏడాది జనవరి 11లోగా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 26న రిపబ్లిక్‌ డే రోజున పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ప్రధాని కార్యాలయం నుంచి మెయిల్‌ వచ్చింది

గతేడాది మా పాఠశాల నుంచి పదో తరగతి విద్యార్థులను పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా రిజిస్ట్రేషన్‌ చేయించాం. దీంతో ఈ ఏడాది కూడా దరఖాస్తు చేసుకోవాలని నేరుగా మెయిల్‌ వచ్చింది. అలాగే జిల్లా విద్యాశాఖాధికారి కూడా దరఖాస్తు చేయించాలని సూచించారు. ఈ ఏడాది సైతం దరఖాస్తు చేయిస్తాం.

- వేణుగోపాల్‌, భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు

దరఖాస్తు చేసుకోవాలి

పరీక్షా పే చర్చ కార్యక్రమానికి సంబంధించి గతంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నేరుగా మెయిల్‌ వస్తుంది. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన తెలివైన విద్యార్థులతో దరఖాస్తు చేయించాలని ఇప్పటికే సూచనలు జారీ చేశాం. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుంది.

-మాణిక్యం నాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి

Updated Date - Dec 15 , 2025 | 12:23 AM