Share News

విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధించాలి

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:24 AM

అంతర్జాతీయస్థాయిలో పట్టు సాధించాలంటే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంగ్లీష్‌పై విద్యార్థులు పట్టు సాధించాలని రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి స్పష్టం చేశారు.

విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధించాలి
మాట్లాడుతున్న సుధామూర్తి

- ఇదే సమయంలో మాతృభాషపై చిన్నచూపు తగదు

- ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి

రాజాం/రూరల్‌, డిసెంబరు 14 (ఆంఽధ్రజ్యోతి): అంతర్జాతీయస్థాయిలో పట్టు సాధించాలంటే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంగ్లీష్‌పై విద్యార్థులు పట్టు సాధించాలని రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి స్పష్టం చేశారు. ఇదే సమయంలో మాతృభాషపై చిన్నచూపు తగదని ఆమె అన్నారు. రాజాంలోని జీఎంఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జీఎంఆర్‌ ఐటీ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాతృభాష, ఆంగ్లభాష శ్రీకృష్ణుడి ఇద్దరు తల్లులైన దేవకి, యశోద వంటివని అన్నారు. ఆ రెండు భాషలు మనలోని వ్యక్తిత్వాన్ని తీర్చుదిద్దుతాయని వెల్లడించారు. విశేషమైన శ్రమ ద్వారా ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే కృషి చేయాలని హితవు పలికారు. ఉన్నతస్థాయికి చేరాక తిరిగి సమాజానికి ఏం ఇవ్వగలమని ఆలోచించి వ్యవహరించాలని యువతకు హితవు పలికారు. లక్ష్యసాధనలో మన మనసులను ఇతర ప్రభావాల నుంచి దూరం చేసుకోవడానికి నిరంతరం కృషి, సాధన చేయాలని సూచించారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో జీఎంఆర్‌ చేస్తున్న కృషిని సుధామూర్తి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, జీఎంఆర్‌ గ్రూపు సంస్థల చైర్మన్‌ గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. జీఎంఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను వివరించారు. తమ కళాశాలలో చదివిన విద్యార్థులు సివిల్‌ సర్వీసులతో పాటు అత్యున్నతమైన ఉద్యోగాలు, రాజకీయాలు, ఔత్సాహిక పారిశ్రామికవే త్తలుగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు జీఎంఆర్‌తో కలిసి సుధామూర్తి నైర్డ్‌ శిక్షణ సంస్థ, జీఎంఆర్‌ వరలక్ష్మి కేర్‌ ఆసుపత్రిని సందర్శించారు. 19 మంది గిఫ్టెడ్‌ చిల్డ్రన్స్‌కు స్కూల్‌బ్యాగులు అందజేశారు. వివిద విభాగాల్లో ప్రతిభ కనబరిచిన పదిమంది విద్యార్థులకు సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 12:24 AM