Students face shortage of safe water విద్యార్థులకు రక్షిత నీరు కరువు
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:47 PM
Students face shortage of safe water బొబ్బిలి మండలం అలజంగి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ఇది. కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. దీంతో ఆ పాఠశాలలో ఉన్న 40 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మఽధ్యాహ్న భోజనం అయ్యాక కొళాయి నీటినే తాగుతున్నారు. చాలా రోజుల నుంచి ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు. దసరా సెలవులు అయ్యేనాటికైనా వాడుకలోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థులకు
రక్షిత నీరు కరువు
పాఠశాలల్లో మూలకు చేరిన ఆర్వో ప్లాంట్లు
కోట్లాది రూపాయల నిధులు వృథా
కుళాయి, బోరు నీరే గతి
పట్టించుకోని ప్రభుత్వం
- బొబ్బిలి మండలం అలజంగి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ఇది. కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. దీంతో ఆ పాఠశాలలో ఉన్న 40 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మఽధ్యాహ్న భోజనం అయ్యాక కొళాయి నీటినే తాగుతున్నారు. చాలా రోజుల నుంచి ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు. దసరా సెలవులు అయ్యేనాటికైనా వాడుకలోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
రాజాం/ బొబ్బిలి రూరల్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు శుద్ధ జలం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు అలంకారప్రాయంగా ఉన్నాయి. రూ.లక్షలు వెచ్చించి పరికరాలు ఏర్పాటు చేశారు. నిర్వహణను విస్మరించారు. ఒక్క బొబ్బిలి మండలంలో దాదాపు 82 ఆర్వో ప్లాంట్లను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. నిర్వహణ గురించి అటు అధికారులు, ఇటు ఏజన్సీలు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా పడి ఉన్నాయి. జిల్లా అంతా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు కలుషిత నీటిని తాగుతూ కాలం వెళ్లదీస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇళ్ల నుంచి బాటిళ్లతో తాగునీరు తెచ్చుకుంటున్నారు. అవి అయిపోయాక కొళాయి లేదంటే బోరు నీరే గతి అవుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాఠశాల విద్యకు సంబంధించి చాలా మార్పులు తీసుకొచ్చింది కానీ మూలకు చేరిన రక్షిత నీటి ప్లాంట్లను మాత్రం వినియోగంలోకి తేలేకపోతోంది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి వైసీపీ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో తొలి విడత ‘నాడు-నేడు’ పథకంలో భాగంగా 841 పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు మంజూరయ్యాయి. కానీ 680 పాఠశాలల్లో మాత్రమే ఏర్పాటుచేశారు. ఇందుకుగాను అప్పట్లో రూ.183 కోట్లు ఖర్చుచేశారు. రెండో విడతలో 738 పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు మంజూరుకాగా.. రూ.231 కోట్లు ఖర్చుచేశారు. రెండు విడతల్లో కలిపి ఆర్వో ప్లాంట్ల నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా ఈ ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. దీంతో తాగునీటి కోసం విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. చేతిపంపు కాని కుళాయిల నీటిని కాని తాగుతున్నారు. ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి ఉన్నా బాగుచేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం మెనూ అమలుచేస్తోంది. అయితే విద్యార్థులకు అత్యవసరమైన తాగునీటి అంశాన్ని నిర్లక్ష్యం చేయడం విమర్శలకు తావిస్తోంది.
విద్యార్థుల సంఖ్యను బట్టి..
వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యబట్టి ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేశారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకూ ఖర్చుచేశారు. విద్యార్థులకు ఫ్లోరైడ్, ఇతర సమస్యల నుంచి విముక్తి కల్పించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసినట్టు ఆ ప్రభుత్వం ప్రకటించింది కానీ నిర్వహణను చూడలేకపోయింది. దీంతో రకరకాల కారణాలతో ప్లాంట్లు మూలకు చేరాయి. ఆహ్లాద ఇంజనీర్స్ లిమిటెడ్, ఇన్నోవేటివ్ ఇండస్ర్టీస్, లివ్‌ప్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పలు కంపెనీల నుంచి ఆర్వో ప్లాంట్లను తెప్పించారు. అప్పట్లో సాంకేతిక సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. అయినా నిర్వహణను సరిగా చూడలేకపోయారు. ప్లాంట్లు పనిచేయడం లేదని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు ఫోన్ చేస్తుంటే టెక్నికల్ సిబ్బంది స్పందించడం లేదు. దీంతో హెచ్‌ఎంలు సైతం మౌనం దాల్చాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరముంది. లేకుంటే వందల కోట్లు విలువచేసే ఆర్వో ప్లాంట్లు దేనికీ పనికిరాకుండా పోయే పరిస్థితి ఉంది.
దృష్టిసారించాం
ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. వాటికి మరమ్మతులు చేస్తాం. ఇప్పటికే సంబంధిత కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటాం.
- యు.మాణిక్యాలనాయుడు, డీఈవో, విజయనగరం