Share News

Struggling with workload పనిభారంతో సతమతం

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:43 PM

Struggling with workload ఏ శాఖలైనా బదిలీలు అంటే సంబరపడతారు పోలీస్‌ శాఖలో మాత్రం నిరాశ పడతారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా అదే ఒత్తిడి. తక్కువ సిబ్బంది పనిచేయడమే దీనికి కారణం. వాస్తవానికి ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో 40 మంది సిబ్బంది ఉండాలి. ఎక్కడా 20కు మించి లేరు. దీంతో సిబ్బంది పని ఒత్తిడికి గురవుతున్నారు.

Struggling with workload పనిభారంతో సతమతం

పనిభారంతో సతమతం

పోలీసులకు తప్పని పనిభారం

వేధిస్తున్న సిబ్బంది కొరత

రెండేసి సిఫ్టుల్లో విధులు

కొత్త కానిస్టేబుళ్లు వస్తేనే కాస్తా ఉపశమనం

రాజాం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

ఏ శాఖలైనా బదిలీలు అంటే సంబరపడతారు పోలీస్‌ శాఖలో మాత్రం నిరాశ పడతారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా అదే ఒత్తిడి. తక్కువ సిబ్బంది పనిచేయడమే దీనికి కారణం. వాస్తవానికి ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో 40 మంది సిబ్బంది ఉండాలి. ఎక్కడా 20కు మించి లేరు. దీంతో సిబ్బంది పని ఒత్తిడికి గురవుతున్నారు. రిటైర్మంట్‌ వయసు 58 నుంచి 62 ఏళ్లకు పెరిగేసరికి చాలా శాఖల్లో ఆనందం కనిపించింది కానీ పోలీస్‌ శాఖలో మచ్చుకైనా కానరాలేదు. ఇప్పటికీ చాలా మందికి షిఫ్టుల్లో పనిచేయాల్సి వస్తోంది. రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నవారు కోకొల్లలు. మూడు షిఫ్టులనేది కాగితాలకే పరిమితమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తిచేసుకొని వస్తే కొంత ఉపశమనం దక్కుతుందని భావిస్తున్నారు. కొత్తగా ఆరు వేల కానిస్టేబుల్‌ పోస్టులతో పాటు ఎస్‌ఐ పోస్టులు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకూ వారికి శిక్షణే ప్రారంభం కాలేదు.

షిఫ్టుల రొటేషన్‌

పోలీస్‌ శాఖలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఒక షిఫ్ట్‌, మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకూ మరో షిఫ్ట్‌ ఉంటుంది. అయితే ఉదయం షిఫ్ట్‌ చేసిన వారు మళ్లీ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ చేయాల్సిందే. దీనినే రెండు షిప్టుల పద్ధతిగా పరిగణిస్తారు. సిబ్బంది లేకపోవడంతో రొటేషన్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన నెలలో విధిగా ప్రతిఒక్కరూ 15 రోజుల పాటు నైట్‌ షిఫ్టులు చేయాల్సి ఉంటుంది. దీంతో మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. చాలా మంది గుండెపోట్లకు, ఇతర రుగ్మతలకు గురవుతున్నారు. సిబ్బందిని నియమించి మూడు షిప్టులు కొనసాగిస్తే.. నెలకు పదికి మించి నైట్‌ డ్యూటీలు రావు. అది కూడా ప్రతి మూడు రోజులకు ఒకసారి నైట్‌ డ్యూటీ పడే అవకాశం ఉంది. వీక్లీఆఫ్‌లు సైతం తీసుకునేందుకు వెసులబాటు కలుగుతుంది.

ఉమ్మడి జిల్లాలో మూడు సబ్‌ డివిజన్లను 10 సర్కిళ్లుగా విభజించారు. జిల్లా వ్యాప్తంగా 41 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. వీటితో పాటు సీసీఎస్‌, మహిళా, ట్రాఫిక్‌, మెరైన్‌ పోలీస్‌స్టేషన్లు కొనసాగుతున్నాయి. ఏ స్టేషన్‌లోనూ పూర్తిస్థాయి సిబ్బంది లేరు. పెరుగుతున్న విధులకు ఈ సిబ్బంది ఏ మూలకూ చాలడం లేదు. ఉన్న కొద్దిపాటి సిబ్బంది షిఫ్ట్‌లు వేసుకొని విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర, అనారోగ్య పరిస్థితులు, ఇంటి అవసరాలకు గంటల లెక్కనే సెలవు మంజూరవుతోంది. అత్యవసరం అయితే తోటి సిబ్బందితో సర్దుబాటు చేసుకోవాల్సిందే. అదీ కూడా స్టేషన్‌ అధికారి అనుతిస్తేనే. లేకుంటే ఇబ్బందులు తప్పవు.

చేతి ‘చమురు’

జిల్లాలో దాదాపు ప్రతిస్టేషన్‌లోనూ రక్షక్‌ వాహనాలున్నాయి. అయితే ప్రతినెల 20 నాటికే రక్షక్‌ వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ ఉండడం లేదు. దీంతో సిబ్బంది జేబులకు చిల్లులు పడక తప్పని పరిస్థితి. అసలే అంతంతమాత్రం జీతం కావడంతో వారు పడే బాధలు వర్ణనాతీతం. ఒక్కో రక్షక్‌ వాహనానికి నెలకు 120 లీటర్ల డీజిల్‌ ఇస్తున్నారు. కానీ పాత వాహనాలు కావడం, మైలేజీ రాకపోవడంతో 15 రోజులకే డీజిల్‌ అయిపోతోంది. ఆ తర్వాత ఎవరో ఒకరిపై ఆధారపడక తప్పడం లేదు. ఇంతలో రక్షక్‌ వాహనాలు మరమ్మతులకు గురైతే అంతే పరిస్థితి. బ్లూకోట్స్‌ వాహనాల పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. నెలకు 30 లీటర్ల పెట్రోల్‌ ఇస్తున్నారు. చాలకపోవడంతో సిబ్బంది పెట్టాల్సి వస్తోంది. వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా దృష్టిపెట్టాలని పోలీసులు కోరుతున్నారు.

------------

Updated Date - Nov 18 , 2025 | 11:43 PM