Share News

Anemia రక్తహీనత నివారణకు పటిష్ఠ చర్యలు

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:40 PM

Strong Measures to Prevent Anemia ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. రక్తహీనత సమస్య లేకుండా చూడాలన్నారు. శుక్రవారం కురుపాంలో ఏపీ గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలను సందర్శించారు.

  Anemia రక్తహీనత నివారణకు  పటిష్ఠ చర్యలు
కురుపాం ఆదర్శ పాఠశాలలో విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌

  • విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి

కురుపాం,సెప్టెంబరు19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. రక్తహీనత సమస్య లేకుండా చూడాలన్నారు. శుక్రవారం కురుపాంలో ఏపీ గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థినికి తొమ్మిది పాయింట్లు కంటే తక్కువ రక్తం తక్కువ ఉండరాదన్నారు. క్యారెట్‌, మునగాకు వంటి పోషకాలు కలిగిన ఆహారం అందించాలని, వయసుకు తగిన బరువు, ఎత్తుతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే రక్తహీనత ఉండరాదని స్పష్టం చేశారు. విద్యార్థినులకు మరోసారి హిమోగ్లోబిన్‌ టెస్ట్‌లు చేయించాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ కృష్ణ వేణి, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలన్నారు. అనంతరం స్థానిక ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాలను కలెక్టర్‌ సందర్శించారు. విద్యార్థులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. వారితో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యత, రుచిని పరిశీలించారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

యూరియా వినియోగం తగ్గించండి

కురుపాం రూరల్‌: రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని కలెక్టర్‌ సూచించారు. రస్తాకుంటుబాయి గ్రామ సచివాలయంలో అన్నదాతలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాది పొడవునా ఆదాయాన్ని ఇచ్చే పంటలను సాగు చేయాలన్నారు. వరితో పాటు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలన్నారు. సచివాలయం ద్వారా ప్రజలకు ప్రభుత్వ పఽథకాలు ఎలా అందుతున్నాయని కార్యదర్శి రామును అడిగి తెలుసుకున్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన

గుమ్మలక్ష్మీపురం: తాడికొండ పంచాయతీలో కొండశిఖర గ్రామాలైన సీహెచ్‌.జంగిడిభద్ర, అడ్డంగి, ఓడ్రుమంగిలో రహదారి పనుల నాణ్యతను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం ఎగువతాడికొండలో వాటర్‌ఫాల్స్‌ను సందర్శించారు. టూరిజం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, గిరిజన ప్రాంత అభివృద్ధి, రహదారుల నిర్మాణం, యువతకు ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు, నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వస్తే తగిన విధంగా ప్రోత్సహిస్తామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ చాణిక్య, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రి రూపు రేఖలు మార్చండి

జియ్యమ్మవలస: ఆసుపత్రిని సుందరంగా తీర్చిదిద్ది రూపు రేఖలు మార్చాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాలు, ఎల్‌ఈడీ లైట్లు పనిచేస్తున్నాయా లేదా అని సూపరింటెండెంట్‌ చైతన్యను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ అధికారులతో మాట్లాడి ఆసుపత్రి ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఇక ఆసుపత్రి ఆవరణలో మొక్కలు, పండ్ల తోటలు పెంచాలని ఆదేశించారు.

Updated Date - Sep 19 , 2025 | 11:40 PM