Share News

Striving to provide quality electricity నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కృషి

ABN , Publish Date - Jul 28 , 2025 | 11:59 PM

Striving to provide quality electricity ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

Striving to provide quality electricity నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కృషి
పెదతాడివాడలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు

నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కృషి

రాష్ట్ర ఇందన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్‌

పెదతాడివాడ వద్ద సబ్‌ స్టేషన్‌కు శంకుస్థాపన

డెంకాడ, జూలై 28(ఆంధ్రజ్యోతి): ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పెదతాడివాడ వద్ద రూ.2.8 కోట్లతో 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మాణానికి ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి మంత్రి రవికుమార్‌ సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలను పెంచకుండానే పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం అయిదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్‌ చార్జీలను పెంచడమే కాకుండా విద్యుత్‌ రంగ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాకు అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే సుమారు 78 వేల విద్యుత్‌ కనెక్షన్లను మంజూరు చేసినట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 6 సబ్‌ స్టేషన్లు ప్రారంభించామని, మరో 3 నిర్మాణంలో ఉన్నాయన్నారు.

- ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకం కింద దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లకు సోలార్‌ విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా కాగా వాటిలో 20 లక్షలను మన రాష్ట్రానికి కేటాయించడం గర్వకారణమని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నియోజకవర్గానికి కనీసం 10 వేలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై బ్యాంకర్లు, వెండర్స్‌ లబ్ధిదారులతో సమావేశాలను నిర్వహించి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ పెదతాడివాడ వద్ద సబ్‌ స్టేషన్‌ను మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

లో ఓల్టేజీ సమస్య ఉండదు

తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ పృథ్వితేజ్‌ మాట్లాడుతూ దాసన్నపేట, డెంకాడ సబ్‌ స్టేషన్‌లపై ఒత్తిడి తగ్గించి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఈ సబ్‌ స్టేషన్‌ ఉపయోగపడుతుందని చెప్పారు. లోవోల్టేజీ సమస్యను పరిష్కరించడమే కాకుండా అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేసేందుకు, భవిష్యత్‌ అవసరాలను తీర్చడానికి ఇది దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు, ప్రభుత్వ విప్‌ వేపాడ చిరంజీవిరావు, ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎం.లక్ష్మణరావు, ఆర్డీవో డి.కీర్తి, ఎంపీపీ బి.వాసుదేవరావు, విద్యుత్‌శాఖ ఏఈ అప్పలస్వామి నాయుడు, తహసీల్దార్‌ రాజారావు, టీడీపీ నాయకులు పనిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 11:59 PM