Share News

మలేరియా రహిత సమాజం కోసం కృషి

ABN , Publish Date - Oct 25 , 2025 | 10:52 PM

మలేరియా రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.ప్రభాకర్‌రెడ్డి కోరారు.

మలేరియా రహిత సమాజం కోసం కృషి
ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): మలేరియా రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.ప్రభాకర్‌రెడ్డి కోరారు. మండలంలోని గొరిడి గ్రామంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో శనివారం ‘మా ఊరికి మలేరియా వచ్చింది’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందరంగా ఆయన మాట్లాడుతూ.. గొరిడిలో ఒక్క మలేరియా కేసు కూడా రాకూడదని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని గ్రామస్థులు మాట ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మలేరియా వ్యాప్తిని అరికట్టడానికి, ప్రజల్లో అవగాహన పెంచడానికి మా ఊరికి మలేరియా వచ్చింది పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం నాలుగు యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. మలేరియా సోకిన గ్రామంతో పాటు దానికి రెండు కిలోమీటర్లు పరిధిలో ఉన్న అన్ని నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఈ అవగాహన కార్య క్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. దోమలు కుట్టకుండా తప్పనిసరిగా దోమ తెరలు వినియోగించాలని, పొడవాటి చొక్కాలు, ప్యాంట్లు ధరించాలని, కర్పూరం వేసిన నూనెను రాసుకోవాలని సూచించారు. బంతి, చామంతి, నిమ్మగడ్డి వంటి మొక్కలను ఖాళీ స్థలాలు, గట్లుపై పెంచుకోవడం ద్వారా దోమలను అరికట్టవచ్చునని అన్నారు. ఎవరికైనా ఆగకుండా జ్వరం వస్తే వెంటనే సంబంధిత ఏఎన్‌ఎంకు ఫోన్‌ చేయాలన్నారు. వైద్య సిబ్బంది వచ్చి ఆర్‌టీడీ కిట్‌ ద్వారా పరీక్షలు చేస్తారన్నారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వై.మణి, వైద్యాధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 10:52 PM