Share News

Strive to Achieve Goals లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

ABN , Publish Date - May 15 , 2025 | 11:00 PM

Strive to Achieve Goals వ్యవసాయ, అనుబంధ రంగాల్లో లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

  Strive to Achieve Goals  లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

బెలగాం, మే 15 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, అనుబంధ రంగాల్లో లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఏటా 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. జిల్లాలో ఏటా 2.20 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉన్న పాల దిగుబడి ఈ ఏడాది మరింతగా పెరగాలి. గోశాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. మత్స్య సంపదను పెంచాల్సి ఉంది. జీడి, పసుపు, పైనాపిల్‌, పామాయిల్‌ ఇతర అంతర పంటలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. గొర్రెలు, పశువులు, కోళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించాలి.’ అని తెలిపారు. పీఎం జన్‌మన్‌ కింద జిల్లాలో 5,853 గృహాలను గిరిజనులకు మంజూరు చేయగా.. ఇంకా 2,967 ఇళ్ల నిర్మాణం ఎందుకు ఇంకా ప్రారంభం కాలేదని కలెక్టర్‌ ప్రశ్నించారు. వారం రోజుల్లో నిర్మాణం ప్రారంభం కావాలని ఆదేశించారు. గృహ నిర్మాణానికి రూ.2.40 లక్షలు మంజూరు చేయడమే కాకుండా ముందు గానే రూ.70 వేలు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర పథకాల కింద మంజూరైన గృహాల నిర్మాణం త్వరగా పూర్తిచేయడానికి ప్రభుత్వం జిల్లాలో 3,618 మందికి అదనపు నిధులు విడుదల చేసిందన్నారు. పార్వతీపురం, సాలూరు, మక్కువ, కొమరాడ తదితర ప్రాంతాల్లో ప్రగతిని చూపించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో పురోగతి చూపించని సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడో శనివారం విధిగా స్వర్ణ ఆంధ్రా- స్వచ్ఛ ఆంధ్రా కార్య క్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

16 టైలరింగ్‌ శిక్షణ కేంద్రాలు

జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 16 టైలరింగ్‌ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. ఒక్కో కేంద్రంలో 144 మందికి 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం సర్టిఫికెట్‌, కుట్టు మిషన్‌ అందించనున్నట్లు చెప్పారు. మొదటి బ్యాచ్‌కు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, రెండో బ్యాచ్‌కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయం త్రం ఐదు గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఎంపీడీవోలు శిక్షణ కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. సీసీఆర్‌సీ కార్డులు డ్రైవ్‌ మోడ్‌లో జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి కూడా రుణాలు పొందొచ్చన్నారు. రైతుల ఆధార్‌ కార్డుల మిస్‌ మ్యాచ్‌ ఉంటే సరిచేయాలని తెలిపారు. ఆధార్‌, జనన ధ్రువీకరణ పత్రాలు అవసరమైన పిల్లలకు వారి తల్లిదండ్రుల ద్వారా వెంటనే దరఖాస్తు చేయించాలన్నారు.

Updated Date - May 15 , 2025 | 11:00 PM