నా పేరు వాడితే కఠిన చర్యలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:53 PM
రైతుల నుంచి ధాన్యం అదనంగా తీసుకుంటు న్న క్రమంలో మిల్లర్లు నా పేరును వినియోగి స్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి.
బొబ్బిలి, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ధాన్యం అదనంగా తీసుకుంటు న్న క్రమంలో మిల్లర్లు నా పేరును వినియోగి స్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి.. ఇకపై అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తానని ఎమ్మెల్యే బేబీనాయన తీవ్రంగా హెచ్చరించారు. నియోకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ధాన్యం సేకరణకు సంబంధించి మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో జేవీఎస్ ఎస్ రామ్మోహనరావుతో కలిసి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ధాన్యం సేకరణపై ఆరా తీశారు. పలుచోట్ల మిల్లర్లు కుంటిసాకులు చూపుతూ రైతుల నుంచి 5 నుంచి 15 కిలోల వరకు ధాన్యం తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్ధితుల్లో సహించేది లేదన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం తూకం విషయంలో స్వార్థానికి పోతే ఉపేక్షించబోనని, తాను కచ్చితంగా రైతుల పక్షపాతిగానే వ్యవహరిస్తానన్నారు. ఇంతవరకు 30 శాతం మేర ధాన్యం సేకరణ జరిగినట్టు అధికారులు చెప్పడంతో ఈ నెలాఖరుకల్లా 80 నుంచి 90 శాతం మేరకు సేకరించాలని అధికారులను ఆదేశించారు. రైతుల పంటల ఈ-క్రాప్ నమోదులో పొరపాట్లు జరుగుతున్నాయని, వాటిని సరిదిద్దాలన్నారు. అనంతరం ఎరువుల సరఫరా, లభ్యత, డిమాండ్ తదితర అంశాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. మండలాల వారీగా వరి, మొక్కజొన్న పంటల సాగు విస్తీర్ణాన్ని అడిగి తెలుసుకున్నారు. రబీలో ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సమీక్షలో బొబ్బిలి ఏఎంసీ చైర్మన్ ఎన్.వెంకరటనాయుడు, వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదనరావు పాల్గొన్నారు.