గంజాయి స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరించాలి
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:32 AM
: జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులను ఆదేశించారు.
- ఎస్పీ ఏఆర్ దామోదర్
విజయనగరం క్రైం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం పోలీసు అఽధికారులతో ఆయన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని స్మార్ట్ పోలీసింగ్ చేయాలని సూచించారు. నేరస్థులపై, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు లేకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రార్థనా మందిరాలు, ముఖ్య కూడళ్లు, విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తాత్కాలిక అనుమతులు కలిగిన వ్యాపారులను మాత్రమే బాణసంచా విక్రయాలకు అనుమతించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేయాలన్నారు. పోలీసుస్టేషన్ల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని.. ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్‌గ్రేవ్, ఎన్‌డీపీఎస్, పోక్సో, అట్రాసిటీ, మిసింగ్, రోడ్డు ప్రమాదాల కేసులపై దర్యాప్తు పెండింగ్‌లో ఉన్న కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీలు గోవిందరావు, భవ్యరెడ్డి, రాఘవులు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.