Public Distribution System ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:41 PM
Strengthening the Public Distribution System is the Goal ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం సాలూరులోని ఓ రేషన్ దుకాణంలో కార్డుదారులకు బియ్యం అందజేశారు.
జిల్లాలో డిపోల ద్వారా నిత్యావసర సరుకుల సరఫరా ప్రారంభం
భాగస్వాములైన అధికారులు, ప్రజాప్రతినిధులు
పార్వతీపురం/సాలూరు/కురుపాం/గుమ్మలక్ష్మీపురం, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం సాలూరులోని ఓ రేషన్ దుకాణంలో కార్డుదారులకు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏ డిపో నుంచైనా కార్డుదారులు నిత్యావసర సరుకులు పొందొచ్చు. ఎండీయూ వాహనాలతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని తిరిగి పాత పద్ధతిని పునఃప్రారంభించింది. కార్డుదారులు తమకు వీలున్న సమయంలో రేషన్ తీసుకోవచ్చు. వృద్ధులు, దివ్యాంగులు ఇంటికే సరుకులు చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. రేషన్ షాపుల్లో ఇతర నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం. దీనివల్ల డీలర్లు ఆదాయం పెరగనుంది. ఎండీయూ వాహనాలపై ఉన్న లోన్లు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆపరేటర్లు వారి ఉపాధి కోసం ఆ వాహనాలను ఉపయోగించుకోవచ్చు.’ అని తెలిపారు.
- కొమరాడ మండలం సివిని, పార్వతీపురంలోని గెడ్డవీధిలో సబ్‌కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవతో కలిసి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ రేషన్ పంపిణీ చేశారు. కురుపాం న్యూ కాలనీలోని డిపోలో కార్డుదారులకు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం స్థానిక గాంధీనగర్‌లో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేశారు. గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్‌పేట రేషన్ డిపోల వద్ద కూడా ఆమె నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా డిపోల ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభమైంది. కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఒంటరి దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధుల ఇళ్లకు వెళ్లి సరుకులు అందించారు. జిల్లాలో 15 మండలాలతో పాటు పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలు, పాలకొండ నగర పంచాయతీలో సందడిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములయ్యారు.