నిర్దేశిత జోన్లలోనే వీధి విక్రయదారులకు అవకాశం
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:20 AM
నగరంలో నిర్దేశించిన జోన్లలో మాత్రమే వీధి విక్రయాలు నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య స్పష్టం చేశారు.
విజయనగరం రింగురోడ్డు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నగరంలో నిర్దేశించిన జోన్లలో మాత్రమే వీధి విక్రయాలు నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వీధి విక్రయదారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలో నిర్దేశించిన మూడు జోన్లను ప్రక టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్, గ్రీన్, అంబర్ జోన్‌లను ఏర్పాటు చేసి వీధి విక్రయాలకు వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. కలెక్టరేట్ జంక్షన్‌లో ఎస్పీ కార్యాలయం వరకూ, మయూరి కూడలి, అంబేద్కర్ కూడలి, ఎంఆర్ కళాశాల జంక్షన్ నుంచి రాజీవ్ స్టేడియం వరకు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. నగరపాలక సంస్థ కార్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, ఇన్ అండ్ అవుట్ సైడ్ గేటులు, కోట జంక్షన్ నుంచి గుమ్చీరోడ్డు, జిల్లా కోర్టు పరిధి ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించామన్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడా వీధి విక్రయాలు కొనసాగించరాదని ఆదేశించారు.
దాసన్నపేట, రైతు బజారు, బొంకులదిబ్బ, ఉడా కాలనీలు, వివేకానంద, అలకానంద కాలనీలు, ప్రదీప్‌నగర్, అంబేద్కర్ కూడలి, తోటపాలెం, బాబామెట్ట తదితర ప్రాంతాలను గ్రీన్‌జోన్‌గా ప్రకటించామన్నారు. ఈ ప్రాంతాల్లో వీధి విక్రయాలకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. మూడు లాంతర్ల జంక్షన్, లోవర్ ట్యాంకు బండ్ నుంచి ఐనాక్స్ వరకు, ఎస్‌బీఐ జంక్షన్ నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు అంబర్ జోన్‌గా ప్రకటించారు. గురజాడ స్కూల్ జంక్షన్ నుంచి గూడ్స్ షెడ్ రోడ్డు, గంటస్తంభం నుంచి కన్యకాపరమేశరి ఆలయం వరకూ, రైల్వేస్టేషన్, ఆర్ అండ్ బీ రోడ్డు, అంబటి సత్తర్వు రోడ్డులను అంబర్ జోన్‌గా ప్రకటించినట్టు తెలిపారు. ఈ సమా వేశంలో ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఏసీపీలు హరిబాబు, రమణమూర్తి, ఎంహెచ్‌వో డాక్టర్ సాంబమూర్తి, కర్రోతు రాధామణి, సూర్యకు మారి, ఆంజనేయవర్థన్ పాల్గొన్నారు.